Aman Khan : 10 ఓవర్లలో 123 పరుగులు.. చెత్త రికార్డుతో ఫ్యాన్స్ కి షాకిచ్చిన సీఎస్కే బౌలర్

విజయ్ హజారే ట్రోఫీలో ఊహించని విడ్డూరం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఒకవైపు ఆందోళన, మరోవైపు ఆశ్చర్యం కలిగించేలా ఒక బౌలర్ దారుణంగా విఫలమయ్యాడు.

Update: 2025-12-30 06:10 GMT

Aman Khan : 10 ఓవర్లలో 123 పరుగులు.. చెత్త రికార్డుతో ఫ్యాన్స్ కి షాకిచ్చిన సీఎస్కే బౌలర్

Aman Khan : విజయ్ హజారే ట్రోఫీలో ఊహించని విడ్డూరం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఒకవైపు ఆందోళన, మరోవైపు ఆశ్చర్యం కలిగించేలా ఒక బౌలర్ దారుణంగా విఫలమయ్యాడు. పుదుచ్చేరి కెప్టెన్, సీఎస్కే కొత్త ప్లేయర్ అమన్ ఖాన్ బౌలింగ్‌లో జార్ఖండ్ బ్యాటర్లు ఊచకోత కోశారు. పది ఓవర్ల కోటాలో అతను ధారపోసిన పరుగులు చూసి క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెడుతోంది. లిస్ట్-A క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌలర్‌గా అమన్ ఖాన్ ఒక అవాంఛిత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

అహ్మదాబాద్ వేదికగా జార్ఖండ్, పుదుచ్చేరి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అమన్ ఖాన్ కు ఒక పీడకలలా మిగిలిపోయింది. పుదుచ్చేరి జట్టుకు కెప్టెన్ గా ఉండి బాధ్యతాయుతమైన స్పెల్ వేయాల్సిన అమన్, 10 ఓవర్లలో ఏకంగా 123 పరుగులు సమర్పించుకున్నాడు. అతని ఎకానమీ రేటు గంటకు 12.30గా నమోదైంది. పురుషుల లిస్ట్-A క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఇన్ని పరుగులు ఇచ్చిన బౌలర్ మరొకరు లేరు. ఇంతకుముందు అరుణాచల్ ప్రదేశ్ బౌలర్ మిబోమ్ మోసు (116 పరుగులు) పేరిట ఉన్న చెత్త రికార్డును అమన్ ఇప్పుడు అధిగమించాడు.

అమన్ ఖాన్ బౌలింగ్‌ను టార్గెట్ చేసిన జార్ఖండ్ బ్యాటర్లు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కుమార్ కుశాగ్ర సెంచరీతో చెలరేగగా, అనుకూల్ రాయ్ కేవలం తృటిలో సెంచరీ మిస్ చేసుకుని 98 పరుగులు చేశాడు. వీరి ధాటికి జార్ఖండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 368 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో పుదుచ్చేరి జట్టు 235 పరుగులకే కుప్పకూలడంతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. అమన్ ఖాన్ బ్యాట్‌తో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు (28 పరుగులు).

ఐపీఎల్ 2026 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అమన్ ఖాన్‌ను 40 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది. గతంలో కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ఆడిన అనుభవం ఉన్న అమన్, ఆల్ రౌండర్ గా సీఎస్కేకు ఉపయోగపడతాడని ధోనీ టీమ్ భావించింది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఇలాంటి ఘోరమైన ప్రదర్శన చేయడం ఇప్పుడు సీఎస్కే మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు "ధోనీ భయ్యా.. ఇతడిని ఎలా సెట్ చేస్తావ్?" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి క్రికెట్ లో రికార్డులు రావడం సహజం, కానీ ఇలాంటి రికార్డులు మాత్రం కెరీర్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఐపీఎల్ లో అమన్ ఖాన్ ఈ వైఫల్యాన్ని అధిగమించి పుంజుకుంటాడో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News