AI Clinic: ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ క్లినిక్.. ఎక్కడో తెలుసా.?
AI Clinic: ప్రపంచంలోనే మొదటిసారిగా రోగులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి పరీక్షించే క్లినిక్‌ను సౌదీ అరేబియాలో ప్రారంభించారు.
AI Clinic: ప్రపంచంలోనే మొదటిసారిగా రోగులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి పరీక్షించే క్లినిక్‌ను సౌదీ అరేబియాలో ప్రారంభించారు. చైనా ఆధారిత మెడికల్ టెక్నాలజీ సంస్థ Synyi AI,అల్‌ముసా హెల్త్ గ్రూప్ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాయి. ఇది ఈస్ట్ ప్రావిన్స్‌లోని అల్-అహ్సా ప్రాంతంలో ప్రారంభమైంది.
ఈ ఏఐ క్లినిక్‌లో రోగులను మొదట పరీక్షించేది మానవ డాక్టర్లు కాకుండా ఏఐ డాక్టర్లే. అయితే భద్రత కోసం మానవ డాక్టర్లు చివరికి పర్యవేక్షణ చేస్తారు.
ఏఐ క్లినిక్ ఎలా పని చేస్తుంది?
రోగులు క్లినిక్‌కి వచ్చిన తర్వాత, ఒక టాబ్లెట్ కంప్యూటర్‌లో వారి సమస్యలను ఏఐ డాక్టర్ "డాక్టర్ హువా"కు చెప్తారు. ఆ తర్వాత డాక్టర్ హువా మరిన్ని ప్రశ్నలు అడుగుతుంది, ఫోటోలు, డేటా లాంటి సమాచారాన్ని మానవ సహాయకుల సహాయంతో విశ్లేషిస్తుంది. చికిత్స ఎలా చేయాలో ఒక ప్లాన్‌ను డాక్టర్ హువా అందిస్తుంది. చివరగా మానవ డాక్టర్ ఆ ప్లాన్‌ను రివ్యూ చేసి అంగీకరిస్తారు.
అత్యవసర పరిస్థితుల్లో మానవ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం ఈ ఏఐ డాక్టర్ ఆస్తమా, జ్వరం వంటి 30 రకాల ఊపిరితిత్తుల వ్యాధులపై మాత్రమే సలహా ఇస్తుంది. భవిష్యత్తులో దీనిని 50 రకాల రోగాల వరకు విస్తరించాలన్నది సంస్థ లక్ష్యం.
ఈ ప్రాజెక్ట్ డేటాను సౌదీ ప్రభుత్వానికి సమర్పిస్తారు. 18 నెలల్లో అధికారిక ఆమోదం వచ్చే అవకాశం ఉంది. Synyi AI తెలిపిన వివరాల ప్రకారం, పరీక్షల సమయంలో ఈ ఏఐ డాక్టర్ పొరపాటు శాతం కేవలం 0.3% మాత్రమేఉందని తెలిపారు. Synyi AI సీఈఓ జాంగ్ షావ్డియన్ మాట్లాడుతూ, “ఇప్పటి వరకు ఏఐ డాక్టర్లకు సహాయం చేసింది. కానీ ఇప్పుడు ఏఐ స్వతంత్రంగా రోగులకు పరీక్ష చేసి చికిత్సను సూచించే దశకు చేరుకుంది,” అన్నారు.