Viral Video : స్టేషన్ దాటిపోతే చస్తావా? కదులుతున్న రైలు నుంచి దూకిన ప్రయాణికుడు..ఒళ్ళు గగుర్పొడిచే వీడియో
Viral Video : రైలు ప్రయాణంలో అలారం పెట్టుకోవడం, పక్కవాళ్లను స్టేషన్ రాగానే లేపమని అడగడం మనకు అలవాటే.
Viral Video : స్టేషన్ దాటిపోతే చస్తావా? కదులుతున్న రైలు నుంచి దూకిన ప్రయాణికుడు..ఒళ్ళు గగుర్పొడిచే వీడియో
Viral Video: రైలు ప్రయాణంలో అలారం పెట్టుకోవడం, పక్కవాళ్లను స్టేషన్ రాగానే లేపమని అడగడం మనకు అలవాటే. కానీ ఇక్కడొక ప్రయాణికుడు గాఢ నిద్రలో మునిగిపోయి తన స్టేషన్ వచ్చిన విషయం కూడా మర్చిపోయాడు. తీరా కళ్లు తెరిచి చూసేసరికి రైలు ప్లాట్‌ఫారమ్ వదిలి వేగం పుంజుకుంది. కంగారులో లగేజీ సర్దుకుని రైలు గేటు దగ్గరికి పరిగెత్తిన ఆ ప్రయాణికుడు.. బయట చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అప్పటికే రైలు స్పీడ్ పెరగడంతో కిందకు దూకితే ప్రాణాలు పోతాయన్న భయంతో అక్కడే ఆగిపోయాడు.
తన గమ్యస్థానాన్ని కోల్పోయానన్న ఆందోళనలో ఉన్న ఆ వ్యక్తి, అక్కడే ఉన్న టీటీఈని వేడుకున్నాడు. "సార్, దయచేసి చైన్ లాగి ట్రైన్ ఆపండి.. నేను దిగిపోవాలి" అని ప్రాధేయపడ్డాడు. కానీ టీటీఈ మాత్రం నిబంధనల ప్రకారం దానికి నిరాకరించాడు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప చైన్ లాగడం నేరమని, అలా చేస్తే ఆర్పీఎఫ్ పోలీసులు కేసు పెడతారని హెచ్చరించాడు. తన దగ్గర రైలును సడన్‌గా ఆపే బ్రేకులు ఉండవని టీటీఈ నిష్కర్షగా చెప్పేశాడు. టీటీఈ ఎంతకీ ఒప్పుకోకపోవడంతో ఆ ప్రయాణికుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు.
ఈ తతంగాన్నంతా వీడియో తీస్తున్న ఒక యువతి ఆ ప్రయాణికుడికి ధైర్యం చెప్పింది. "ఇంకా రైలు ఆగదు.. మెల్లిగా దిగడానికి ప్రయత్నించు" అంటూ సలహా ఇచ్చింది. ఇది చాలా ప్రమాదకరమైన సలహా అయినప్పటికీ, ఆ ప్రయాణికుడు వేరే దారి లేక సాహసం చేశాడు. కదులుతున్న రైలు నుండి అతి కష్టం మీద పట్టు కోల్పోకుండా కిందకు దిగాడు. అతను క్షేమంగా దిగగానే, ఆ యువతి అతని లగేజీని బయటకు విసిరేసి "బెస్ట్ ఆఫ్ లక్" అంటూ విష్ చేసింది. అతను సురక్షితంగా బయటపడటంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నా, ఒక చిన్న అజాగ్రత్త ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో vaishnawi_official_64 అనే ఖాతా నుండి ఈ వీడియో షేర్ అయింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు ఫోన్‌లో అలారం సెట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కదులుతున్న రైలు నుండి దిగడం చట్టరీత్యా నేరమే కాకుండా ప్రాణాలకు ముప్పు అని రైల్వే శాఖ ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటుంది. ఒక చిన్న నిద్ర ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కంటే, తర్వాతి స్టేషన్‌లో దిగి వెనక్కి రావడం ఉత్తమమైన మార్గమని ఈ ఘటన మనకు గుర్తు చేస్తోంది.