74 ఏళ్లుగా ఏటా ఘనంగా చవితి ఉత్సవాలు.. నిమజ్జనం మాత్రం లేదు కారణం ఏంటో తెలుసా..?!

Palaj Ganesh Temple: సాధారణంగా వినాయక ఉత్సవాల ముగింపు సందర్భంగా గణేష్ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తుంటారు.

Update: 2022-09-05 09:51 GMT

74 ఏళ్లుగా ఏటా ఘనంగా చవితి ఉత్సవాలు.. నిమజ్జనం మాత్రం లేదు కారణం ఏంటో తెలుసా..?!

Palaj Ganesh Temple: సాధారణంగా వినాయక ఉత్సవాల ముగింపు సందర్భంగా గణేష్ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తుంటారు. కానీ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో కొలువుదీరిన కర్ర గణపతి మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఉత్సవాలలో భాగంగా పదకొండు రోజుల విశేష పూజల తర్వాత ఈ లంబోదరుణ్ణి ఊరేగించి ఒక ప్రత్యేక గదిలో భద్రంగా ఉంచడం ఇక్కడ ఆనవాయితీ. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన పాలజ్ గ్రామంలో కొలువుదీరిన కర్ర గణపతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 11 రోజులపాటు జరిగే ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. అయితే గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలను నిరాడంబరంగా జరుపుకున్న గ్రామస్థులు ఈ ఏడాది గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

పాలజ్ గ్రామం మహారాష్ట్రలో ఉన్నా ఇక్కడి మాట తీరు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, బంధుత్వాలు, మన ప్రాంతంలోనే ముడిపడి ఉంటాయి. చూడటానికి చిన్న గ్రామమైన వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరంతా పండగ వాతావరణం నెలకొంటుంది. గణేష్ ఉత్సవాల సందర్భంగా పదకొండు రోజులపాటు గ్రామస్థులు ఎంతో నియమనిష్టలతో ఉంటారు. అంతేకాకుండా ప్రత్యేక వినాయక దీక్షలు చేపడతారు. కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ఈ కర్ర గణేశునికి పేరుంది. దీంతో ఇతర ప్రాంతాలనుండి సైతం ఇక్కడికే భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. నిర్మల్ జిల్లా మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న పాలజ్ గ్రామస్తులు కర్ర గణపతిని తయారు చేయించి 74 ఏళ్లుగా కొలుస్తున్నారు. ఈ గ్రామంలో ఒకే విగ్రహాన్ని పూజించడం ప్రత్యేకత. అందుకే ఈ గ్రామం ఇతరులకు ఆదర్శనంగా నిలుస్తోంది

1948 సంవత్సరంలో మొదటిసారిగా ఈ కర్రగణపతిని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ ఏడాది గ్రామంలో అంటువ్యాధులు ప్రబలి సుమారు 30 మంది చనిపోయారట అయితే ఆ సమయంలోనే వినాయక చవితి పండగ వచ్చిందట. మహమ్మారి బారి నుండి రక్షించుకోడానికి గ్రామంలో వినాయకుని ప్రతిష్టించాలని నిర్ణయించుకున్నారటా. వెంటనే నిర్మల్‌లో ఉన్న కళాకారుని చేత కర్ర గణపతి విగ్రహాన్ని తయారు చేయించి, గ్రామంలో ప్రతిష్టించి నవరాత్రులు భక్తి శ్రద్దలతో కొలిచారట. దాంతో అంటువ్యాధులు పూర్తిగా మటుమాయం కావడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారట. అప్పటినుండి ఆ కర్ర గణపతిని ప్రతి ఏటా ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారట. ఉత్సవాలలో భాగంగా చివరి రోజున విగ్రహాన్ని ఊరేగించి గ్రామ సమీపంలో ఉన్న వాగువద్దకు తీసుకెళ్లి, వాగునీళ్ళు విగ్రహానిపై నీల్లు చల్లుతారు. ఆ తర్వాత మళ్ళీ కర్ర గణపతిని ప్రత్యేక గదిలో బద్రపరుస్తారు. ఒకవైపు దేశం స్వాతంత్య75వ వజ్రోత్సవాలను జరుపుకుంటుంటే మరోవైపు పాలజ్‌లోనూ కర్ర గణపతి 74 వసంతోత్సవాలను నిర్వహించుకుంటూ భక్తులు ఆధ్యాత్మికతను చాటుకుంటున్నారు.

Tags:    

Similar News