Viral Video : టీ కొట్టు స్కామ్ బట్టబయలు..రూ.5 టీని రూ.10కి ఎలా అమ్ముతున్నారో చూడండి
టీ కొట్టు స్కామ్ బట్టబయలు..రూ.5 టీని రూ.10కి ఎలా అమ్ముతున్నారో చూడండి
Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అని రోజుకో వింత వెలుగులోకి వస్తోంది. తాజాగా టీ దుకాణాల్లో సామాన్యులకు తెలియకుండానే జరుగుతున్న ఒక చిన్న బిజినెస్ ట్రిక్ లేదా స్కామ్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మనం రోజూ తాగే టీ విషయంలో కూడా ఇంత ప్లానింగ్ ఉంటుందా అని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. నేటి డిజిటల్ యుగంలో ప్రతి చిన్న విషయాన్ని కెమెరాలో బంధించడం అలవాటైపోయింది. ఈ క్రమంలోనే ఇన్ స్టాగ్రామ్ లో @ankurpandeylife అనే అకౌంట్ నుంచి షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక వ్యక్తి టీ కొట్టుకు వెళ్లి మనందరికీ తెలిసిన ఒక చిన్న సత్యాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించాడు. మనం ఏదైనా రోడ్డు పక్కన టీ తాగేటప్పుడు సాధారణ ప్లాస్టిక్ లేదా పేపర్ కప్పులో తాగితే దాని ధర రూ.5 ఉంటుంది. అదే మట్టి కప్పులో తాగితే దాని ధర రూ.10కి పెరుగుతుంది. సాధారణంగా మట్టి కప్పులో తాగితే ఆరోగ్యం, టేస్ట్ బాగుంటుందని మనం ఐదు రూపాయలు అదనంగా ఇస్తుంటాం.
కానీ ఆ వ్యక్తి చేసిన ప్రయోగం చూస్తే మీకు దిమ్మతిరిగిపోతుంది. అతను మొదట రూ.10 పెట్టి ఒక మట్టి కప్పు టీ కొన్నాడు. ఆ తర్వాత అదే టీని పక్కనే ఉన్న రూ.5 ఖరీదు చేసే ప్లాస్టిక్ కప్పులోకి వంచాడు. చిత్రమేమిటంటే.. మట్టికప్పులో ఉన్న టీ పరిమాణం సరిగ్గా ప్లాస్టిక్ కప్పుకు సరిపోయింది. అంటే టీ క్వాలిటీ లో గానీ, క్వాంటిటీలో గానీ ఎలాంటి మార్పు లేదు. కేవలం అది ఏ కప్పులో ఇస్తున్నారు అన్న దాని మీద ధర రెట్టింపు అయిపోయింది. టీ దుకాణదారులు ప్లాస్టిక్ కప్పుకు ఇచ్చే టీనే మట్టి కప్పులో పోసి అదనపు లాభాన్ని గడిస్తున్నారని ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "మట్టి కప్పు ఖరీదు కూడా ఉంటుంది కదా.. అందుకే ధర పెరిగింది" అని కొందరు సమర్థిస్తుంటే, "మట్టి కప్పు ఖరీదు రూపాయి కంటే ఎక్కువ ఉండదు, కానీ టీ వాడు ఏకంగా ఐదు రూపాయలు అదనంగా వసూలు చేయడం అన్యాయం" అని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తం మీద ఈ వీడియో మనకు ఏం చెబుతుందంటే.. నేటి మార్కెట్ లో వస్తువు కంటే కూడా దాన్ని ఎలా ప్యాకేజీ చేసి అమ్ముతున్నారు అనే దానికే మనం ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నాం. అది చౌకగా దొరికే టీ అయినా.. లక్షల రూపాయల కార్పొరేట్ ఉత్పత్తులైనా సూత్రం మాత్రం ఒక్కటే.