గూగుల్ మ్యాప్స్‌ను బ్లైండ్‌గా నమ్మితే ఇలాగే ఉంటుంది.. అసలేమైందంటే
Google Maps: ఒకప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్తే తెలియని అడ్రస్ కోసం పక్కనున్న వారిని అడిగే వారు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ మారింది. వెంటనే జేబులోని స్మార్ట్ ఫోన్ తీసి గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేస్తున్నారు. తెలిసిన అడ్రస్ అయినా షార్ట్ కట్ కోసం మ్యాప్స్‌నే ఆశ్రయిస్తున్నారు. అయితే గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మితే ఇబ్బందులు తప్పవని ఇప్పటికే చాలా సంఘటనలు రుజువు చేశాయి.
తాజాగా ఇలాంటి ఓ ఘటనే ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మిన ఓ లారీ డ్రైవర్ కొండల్లో ఇరుక్కుపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం నుంచి తాడిపత్రికి ఐరన్ లోడుతో కంటైనర్ ట్రాలీ లారీతో డ్రైవర్ ఫరూక్ బయల్దేరాడు. రాత్రి సమయంలో అనంతపురం జిల్లా యాడికి మండలం రామన్న గుడిసెల దగ్గరకు వచ్చేసరికి చీకటి పడటంతో దారి తెలియక డ్రైవర్ ఫరూక్ గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకున్నాడు.
మ్యాప్స్‌లో చూపించిన విధంగా ముందుకు సాగాడు. అయితే ఎంతకీ గమ్య స్థానం రాలేదు. కొండల్లోకి దారి చూపించడంతో ఏదైనా షార్ట్ కట్ కాబోలు అంటూ ఫాలో అయిపోయాడు. చాలా దూరం వెళ్లిన తర్వాత దారి తప్పిన విషయాన్ని గుర్తించాడు. వెంటనే లారీని వెనక్కి తిప్పుదామని ప్రయత్నించాడు. రివర్స్ గేర్ వేసి లారీని కాస్త మూవ్ చేశాడు.
అంతే ఒక్కసారిగా లారీ లోయలోకి పడిపోయింది. దీంతో వెంటనే విషయాన్ని గుర్తించిన డ్రైవర్ లారీని ఆపేశాడు. స్థానికులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని జేసీబీలతో ఎంతో కష్టపడి బయటకు తీశారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తన ప్రాణాలు పోయేవని తెలిపిన ఫరూక్, హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. చూశారుగా ఇక నుంచి మ్యాప్స్‌ను ఫాలో అయ్యేముందు ఒకటికి రెండుసార్లు కచ్చితంగా ఆలోచించండి.