Viral Video: కాల్ సెంటర్‌‌పై పడి ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్ ఎత్తుకెళ్లిన స్థానికులు

Laptops and desktops looted from fake call centre: ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్, మానిటర్స్, కీ బోర్డ్, ఇతర విద్యుత్...

Update: 2025-03-18 08:59 GMT

Viral Video: ఓవైపు కాల్ సెంటర్‌లో సోదాలు.. మరోవైపు ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్ ఎత్తుకెళ్లిన స్థానికులు

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో చైనా దేశస్థులు కాల్ సెంటర్ ముసుగులో అసాంఘీక చర్యలకు పాల్పడుతున్నారని తెలుసుకున్న పాకిస్థాన్ ప్రభుత్వం సోదాలు నిర్వహించింది. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) అధికారులు ఈ సోదాలు జరిపారు. అధికారులు సోదాలకు వచ్చిన విషయం తెలుసుకున్న స్థానికులు కూడా వారితో పాటే కాల్ సెంటర్‌లోకి ప్రవేశించారు. ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్, మానిటర్స్, కీ బోర్డ్, ఇతర విద్యుత్ పరికరాలు... ఇలా ఎవరి చేతికి అందింది వారు తీసుకుని ఉడాయించారు. అవేవి దొరకని వారు చివరకు సోఫాలు, టేబుల్స్, ఇతర ఫర్నిచర్, వస్తుసామాగ్రి ఎత్తుకెళ్లారు.

ఇస్లామాబాద్‌లోని సెక్టార్ F-11 లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది ఒక ఫేక్ కాల్ సెంటర్ అని, కాల్ సెంటర్ పేరుతో ఇందులో అక్రమాలు జరుగుతున్నాయని తమకు సమాచారం అందిందని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెబుతోంది. ఇక్కడి నుండే కాల్ సెంటర్ నిర్వాహకులు ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. చైనీయులతో పాటు ఇంకొంతమంది విదేశీయులు ఈ కాల్ సెంటర్ రన్ చేస్తున్నట్లు ఎఫ్ఐఏ అధికారులు తెలిపారు.

ఈ సోదాల్లో 24 మందిని పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, స్థానికులు ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్ ఎత్తుకెళ్లడంతో వాటిని మాత్రం స్వాధీనం చేసుకోలేకపోయారు. ప్రస్తుతం పోలీసులు అక్కడి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా స్థానికులను గుర్తించి వారి నుండి వస్తుసామాగ్రి రికవర్ చేసుకునే పనిలో బిజీ అయ్యారు.

అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై నెటిజెన్స్ కమెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

పాకిస్థాన్ మొత్తాన్ని చైనా దోచుకుంది. అందుకే, చైనాకు చెందిన కొన్ని ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ప్రింటర్లను పాకిస్థానీయులు దోచుకున్నారు అని ఒక యూజర్ అభిప్రాయపడ్డారు.

పాకిస్థాన్‌లో సామాన్య జనం ఇలా దోపిడీలకు పాల్పడటం ఇదేం అరుదు కాదు. గతేడాది కరాచీలో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ జరిగింది. స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ షాపింగ్ మాల్‌పై పడి చేతికందినవి దోచుకున్నారు. పైగా షాపింగ్ మాల్ కూడా ధ్వంసం చేశారు.

Tags:    

Similar News