Women Power at Toll Plazas: వంటింటి నుంచి హైవేల వరకు.. టోల్ ప్లాజాల్లో 'మహిళా' శక్తి ఎంతో తెలుసా?

Women Power at Toll Plazas: భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI) చారిత్రాత్మక నిర్ణయం. దేశవ్యాప్తంగా 1,140 టోల్ ప్లాజాల్లో 5,100 మందికి పైగా మహిళలు విధుల్లో చేరారు. వంటింటి నుంచి హైవేల వరకు మహిళలు తమ ప్రతిభను ఎలా చాటుతున్నారో, గ్రామీణ మహిళల జీవితాల్లో ఈ మార్పు ఎలాంటి సాధికారతను తెచ్చిందో ఈ స్టోరీలో తెలుసుకోండి.

Update: 2026-03-06 14:30 GMT

Women Power at Toll Plazas: వంటింటి నుంచి హైవేల వరకు.. టోల్ ప్లాజాల్లో 'మహిళా' శక్తి ఎంతో తెలుసా?

Women Power at Toll Plazas: అంతరిక్షం నుంచి ఐటీ రంగం వరకు.. క్రీడల నుంచి ప్రమాదకరమైన పనుల వరకు.. నేడు మహిళలు అడుగు పెట్టని రంగం లేదు. తాజాగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లోనూ మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం పురుషులకే పరిమితమైన ఈ విధుల్లో ఇప్పుడు వేలాది మంది మహిళలు చేరుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI) శుక్రవారం విడుదల చేసిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం టోల్ ప్లాజాలు 1,140 కి పైగా ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 5,100 మందికి పైగా మహిళా ఉద్యోగులు పగటిపూట విధులు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచాలని, మరిన్ని సేవలలో మహిళలను భాగస్వామ్యం చేయాలని NHAI లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

కేవలం ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా, లింగ సమానత్వం, సామాజిక సాధికారతను ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశ్యమని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్లాజా ఆపరేటర్లు, నేషనల్ హైవే బిల్డర్స్ ఫెడరేషన్ (NHBF), హైవే ఆపరేటర్స్ అసోసియేషన్ వంటి కీలక సంస్థలతో చర్చించిన తర్వాత.. టోల్ వసూళ్లలో మహిళలను నియమించడానికి అందరూ ఏకగ్రీవంగా అంగీకరించినట్లు తెలిపింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు ఈ విధుల్లో రాణించేందుకు NHAI ప్రత్యేక శిక్షణను కూడా అందిస్తోంది.

ఫ్రంట్‌లైన్ పాత్రల్లో మహిళలు ఉండటం వల్ల టోల్ ప్లాజాల వద్ద సేవా బట్వాడా మెరుగుపడుతుందని, వాహనదారులతో వ్యవహరించే తీరులో మరింత వృత్తి నైపుణ్యం కనిపిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పగటిపూట విధులకు పరిమితమైన ఈ చొరవ, రానున్న రోజుల్లో మరింత విస్తృతం కానుంది. వేలాది వాహనాల రద్దీ, కాలుష్యం, నిరంతర పని ఒత్తిడి ఉండే టోల్ ప్లాజాల్లో మహిళలు విధులను స్వీకరించడం వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఈ చొరవ గ్రామీణ మహిళల ఆర్థిక స్థితిగతులను మార్చడమే కాకుండా, వారిని స్వశక్తితో ఎదిగేలా చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News