Viral Video: ఉద్యోగి శవపేటిక మోసిన ఇండియన్ బిలియనేర్.. వీడియో వైరల్
ఇండియన్ బిలియనేర్, లులు గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ గా మారారు. తన సంస్థలో పనిచేసే ఉద్యోగి శవపేటికను మోసి ఆయన మళ్లీ వార్తల్లోకెక్కారు. తన సంస్థలో పనిచేసిన షాబుద్దీన్ అనే వ్యక్తి ఫిబ్రవరి 7న గుండెపోటుతో చనిపోయారు. షాబుద్దీన్ మరణవార్త తెలుసుకున్న యూసుఫ్ అలీ... వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరితో కలిసి ఆ అల్లాను ప్రార్థించారు. అనంతరం జరిగిన అంతిమ యాత్రలో షాబుద్దీన్ శవపేటిక మోశారు.
షాబుద్దీన్ అబు ధాబిలోని అల్ వద మాల్ లులు హైపర్ మార్కెట్‌లో సుపర్ వైజర్ గా పనిచేస్తున్నారు. ఆయన మృతిని యూసుఫ్ అలీ జీర్ణించుకోలేకపోయారు. ఆ కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచారు. ప్రేయర్ మీటింగ్, అంతిమయాత్రలో పాల్గొన్న దృశ్యాలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ షాబుద్దీన్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు ప్రార్థించారు.
ఆ వీడియో వైరల్ అయింది. 4 మిలియన్లకుపైగా జనం ఆ వీడియోను వీక్షించారు. 2 లక్షల 36 వేల మంది లైక్ చేశారు. 16 వేల మంది షేర్ చేశారు. ఇంకొన్ని వేల మంది ఆ వీడియోపై తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకున్నారు. కామెంట్స్ చేసిన వారిలో అత్యధిక శాతం నెటిజెన్స్ యూసుఫ్ అలీని అద్భుతమైన బాస్ అని అభినందించడం కనిపించింది.
ప్రపంచంలో ఇంకా ఇలాంటి బాసులు కూడా ఉన్నారా అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. వేల కోట్ల ఆస్తులు ఉండి కూడా ఒక సాధారణ ఉద్యోగి కోసం రావడం, శవపేటిక మోసి అంతిమయాత్రలో పాల్గొనడం నిజంగా ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజెన్స్ కామెంట్స్ రాస్తున్నారు.