Emotional Viral Video : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పైలట్ మాతృప్రేమ.. వీడియో చూస్తే కన్నీరు ఆగదు

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పైలట్ మాతృప్రేమ.. వీడియో చూస్తే కన్నీరు ఆగదు

Update: 2026-02-07 02:14 GMT

Emotional Viral Video : అమ్మంటే ప్రేమ.. అమ్మంటే ఒక ధైర్యం. ఆ అమ్మ దూరమైతే ఆ బిడ్డ పడే వేదన వర్ణనాతీతం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఇండిగో పైలట్ తన తల్లి జ్ఞాపకార్థం షేర్ చేసిన వీడియో నెటిజన్ల కళ్లను చెమర్చిస్తోంది. తన జీవితంలోనే అత్యంత భారంగా చేసిన ఎడిటింగ్ ఇదని ఆయన పేర్కొన్న తీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతోంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో ఇండిగో పైలట్ ప్రదీప్ కృష్ణన్ తన తల్లి పట్ల ఉన్న అపారమైన ప్రేమను చాటుకున్నారు. వీడియో ప్రారంభంలో.. ప్రదీప్ విమానం కాక్‌పిట్ నుంచి అనౌన్స్‌మెంట్ చేస్తుండగా, ప్రయాణికుల్లో కూర్చున్న ఆయన తల్లి ఎంతో గర్వంగా, చిరునవ్వుతో తన కొడుకు వైపు చూడటం కనిపిస్తుంది. కొడుకు పైలట్ అయినందుకు ఆమె కళ్ళల్లో కనిపించే ఆనందం ఎంతో గొప్పగా ఉంది. అయితే మరుక్షణమే ఆ వీడియోలో ఒక విషాదకరమైన మార్పు వస్తుంది. విమానం దిగి వెళ్తున్న ఆమె ఆకృతి, ఆకాశంలో ఒక దేవత రూపంలోకి మారిపోయి మేఘాల మధ్య కలిసిపోతుంది. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తోంది.

ప్రదీప్ కృష్ణన్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. "నా జీవితంలో నేను చేసిన అత్యంత కష్టమైన ఎడిటింగ్ ఇదే" అంటూ రాసుకొచ్చారు. తన తల్లి గొప్పతనం గురించి వివరిస్తూ.. "నాకు ఇదివరకు దేవుడి మీద నమ్మకం ఉండేది కాదు. కానీ ఇప్పుడు నాకు ప్రార్థించడానికి ఒక దేవుడు (మా అమ్మ) ఉంది" అని భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి ఇంట్లో ఎవరైనా వస్తే వారికి దోసె, కాఫీ పెట్టకుండా అస్సలు పంపేది కాదని, ఆమెలో ఎలాంటి అహంకారం ఉండేది కాదని గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో ఎదురైన కష్టాల్లో ఆమె ఎప్పుడూ రక్షణ కవచంలా నిలిచిందని ప్రదీప్ పేర్కొన్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. "మీరు గాలిలో ఎగురుతున్న ప్రతిసారీ మీ అమ్మ పక్కనే ఉండి మిమ్మల్ని చూస్తూ నవ్వుతుంటుంది" అని ఒకరు కామెంట్ చేయగా.. "అమ్మప్రేమ వెలకట్టలేనిది, అది మరణం తర్వాత కూడా మనల్ని కాపాడుతూనే ఉంటుంది" అని మరొకరు రాసుకొచ్చారు. తల్లిదండ్రుల పట్ల ఉండాల్సిన గౌరవాన్ని, ప్రేమను ఈ వీడియో మరోసారి అందరికీ గుర్తు చేస్తోంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే లక్షలాది వ్యూస్ సాధించిన ఈ వీడియో, మాతృప్రేమకు ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.

Tags:    

Similar News