కర్ణాటకం ఈ సారి ఏ టర్న్‌ తీసుకోనుంది.. యడ్డీకి ఈసారైనా పూర్తి యోగం ఉందా?

Update: 2019-07-27 03:20 GMT

కుమారస్వామి సర్కారు కూలిన మూడోరోజుకు ముహూర్తం కుదిరింది. కన్నడ పీఠంపై మరోసారి యడియూరప్ప ఆసీనులయ్యారు. పట్టాభిషేకం పూర్తైంది కానీ బలపరీక్ష మాత్రం ముందుంది. ఎన్నో మలుపులు తిరుగుతున్న కర్ణాటకం ఈ సారి ఏ టర్న్‌ తీసుకోనుంది..? నాలుగోసారి ప్రమాణం చేసిన యడ్డీకి ఈసారైనా పూర్తి యోగం ఉందా..?

కన్నడ కోటపై మరోసారి బీజేపీ జెండా ఎగిరింది. అసెంబ్లీలో విశ్వాసం కోల్పోయిన కుమారస్వామి రాజీనామా తర్వాత శుక్రవారం సాయంత్రం యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర 25 వ ముఖ్యమంత్రిగా యడియూరప్ప చేత గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా ప్రమాణం చేయించారు. బీజేపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో రాజ్ భవన్ కు చేరుకున్న ఆయన పార్టీ కార్యకర్తల హర్షాతిరేకాల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

2007 నవంబర్‌లో తొలిసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్ప 4 రోజులకే సీఎం చైర్ దిగాల్సి వచ్చింది. మద్దితిస్తామన్న జేడీఎస్‌ మాట మార్చడంతో పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టిన యడియూరప్పపై అవినీతి ఆరోపణలు రావడంతో 2011 లో పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన బీజేపీని వదిలి 2012 లో కర్ణాటక జనతాపక్ష పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. అయితే, ఆ పార్టీపై జనాదరణ లేకపోవడంతో తిరిగి 2014 లో తన పార్టీని బీజేపీలో వీలీనం చేశారు. గతేడాది మే 17న మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప మోజార్టీ నిరూపించుకోలేకపోవడంతో మూడు రోజులకే చాపచుట్టేసారు. సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇక కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో నాల్గోసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన యడియూరప్ప ఈ సోమవారం శాసనసభలో విశ్వాసపరీక్షను ఎదుర్కోనున్నారు. దీంతో మరోసారి నెంబర్‌ గేమ్‌ స్టార్ట్ కానుంది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 225 కాగా తాజాగా స్పీకర్ రమేష్ కుమార్ ముగ్గురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. దీంతో, ఎమ్మెల్యేల సంఖ్య 222కు పడిపోయింది. స్పీకర్‌ను మినహాస్తే సభ్యుల సంఖ్య 221 గా ఉంటుంది. ఈ లెక్కన ప్రభుత్వం ఏర్పాటుకు 112 మంది సభ్యుల మద్దతు కావాలి. ఇప్పటికే బీజేపీకి 105 మంది సభ్యుల బలం ఉండగా మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మద్దతు ఇస్తుండడంతో మొత్తం 106 కు చేరుతుంది.

అంటే ప్రభుత్వ ఏర్పాటుకు యడియూరప్పకు మరో ఆరుగురు సభ్యుల మద్దతు అవసరం పడింది. గతంలో ఇలాంటి సీన్‌ ముందే బోల్తా పడ్డ యాడియూరప్ప ఈ సారి ఎలా గట్టెక్కుతారనే చర్చ మొదలైంది. ఈ సమయంలో రెబల్స్‌ ఎంతమంది బీజేపీకి మద్దతుగా నిలుస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇటు రెబల్స్‌పై స్పీకర్ నిర్ణయం కూడా ఆసక్తికరంగా మారింది. దీంతో బలపరీక్షలో ఈ సారైనా గట్టెక్కుతారా..? పేరులో మార్పులు చేసుకున్న యడియూరప్పకు అదృష్టం కలిసొస్తుందా..? అన్నది సోమవారం తెలియనుంది.  

Tags:    

Similar News