Rat Bite: ఎలుక కాటుకు రూ.60వేలు దెబ్బ.. వినియోగదారుల కోర్టు సంచలన తీర్పు... ఎక్కడంటే?

Rat Bite: ఎలుక కాటుకు రూ.60వేలు దెబ్బ.. వినియోగదారుల కోర్టు సంచలన తీర్పు... ఎక్కడంటే?

Update: 2023-05-08 13:48 GMT

Rat Bite: ఎలుక కాటుకు రూ.60వేలు దెబ్బ.. వినియోగదారుల కోర్టు సంచలన తీర్పు... ఎక్కడంటే?

Rat Bite: ఎలుక మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లో ఒక యువకుడు గత ఏడాది ఎలుక తోకకు రాయి కట్టి డ్రైనేజీలో వేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన జంతు ప్రేమికుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎలుకను నీళ్లల్లో పడేసిన మనోజ్ కుమార్ పై కేసు ఫైల్ చేశారు కూడా. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం ముందు యూపీ పోలీసులు 30 పేజీల ఛార్జ్ షీటును కూడా దాఖలు చేశారు. ఈ ఉదంతాన్ని మర్చిపోకముందే ఎలుక మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

సినిమా చూసేందుకు థియేటర్ కి వెళ్లిన మహిళను ఎలుక కరిచింది. ఈ కేసును విచారించిన కోర్టు బాధితురాలికి రూ.60వేలు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అస్సాంలోని కామరూప్ జిల్లాలో 5 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన..కోర్టు తీర్పుతో తాజాగా చర్చనీయాంశం అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..అస్సాంలోని కామ్ రూప్ జిల్లాకు చెందిన అనిత అనే మహిళ సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లింది. ఇంటర్వెల్ సమయంలో ఆమె కాలిని ఎదో కరిచినట్లు అనిపించింది. రక్తం కారుతుండడంతో ఆందోళన చెందిన మహిళ హుటాహుటిన హాస్పటల్ కు వెళ్లింది.

హాస్పటల్ కు వెళ్లిన మహిళకు వైద్యులు వెంటనే వైద్యం అందించలేదు. ఆమెను ఏం కాటేసిందో తెలియక 2 గంటలపాటు చికిత్స అందించలేకపోయారు. ఆ తర్వాత ఎలుక కరిచినట్లు నిర్థారించుకొని అందుకు అవసరమైన చికిత్స చేశారు. హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సదరు మహిళ మరుసటి ఉదయం థియేటర్ యాజమాన్యం పై ఫిర్యాదు చేస్తూ జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించింది. ఈ ఘటన తనను మానసికంగా ఎంతో వేదనకు గురి చేసిందని..వైద్యం, ఇతర ఖర్చులతో పాటు మానసిక వేదనకు అంతా కలిపి రూ.6లక్షలు పరిహారం చెల్లించాలని థియేటర్ యాజమాన్యంపై కేసు వేసింది.

కేసుకు సంబంధించి సుదీర్ఘ విచారణ అనంతరం ఇరు పక్షాల వాదనలు విన్న వినియోగదారుల కోర్టు..బాధితురాలికి రూ.60,000 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. మానసిక వేదనకు రూ.40,000, మెడికల్ బిల్లు నిమిత్తం రూ.2,282, ఇతర నొప్పి, ఇతర ఖర్చులకు గాను రూ.20,000 చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. ఈ మొత్తాన్ని తీర్పు వెలువరించిన 45 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది..లేని పక్షంలో తీర్పు ఇచ్చిన రోజు నుంచి సంవత్సరానికి 12 శాతం వడ్డీ చొప్పున బాధితురాలికి చెల్లించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. మొత్తానికి ఎలుక కాటు కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ ఉదంతం నెట్టింట వైరల్ గా మారింది.

Tags:    

Similar News