Rekha Gupta: ఢిల్లీ సీఎంగా బీజేపి రేఖ గుప్తానే ఎందుకు ఎంచుకుంది?
Why BJP chosen Rekha Gupta: ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీకి ఆమె నాలుగో మహిళా ముఖ్యమంత్రి. బీజేపి తరుపున ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేస్తున్న వారిలోనూ రేఖా గుప్తా నెంబర్ నాలుగే. ఢిల్లీకి బీజేపి నుండి ముఖ్యమంత్రిగా చేసిన వారిలో మదన్ లాల్ ఖురానా ఉన్నారు. ఆయన 1993 డిసెంబర్ 2 నుండి 1996 ఫిబ్రవరి 26 వరకు ఢిల్లీ సీఎంగా ఉన్నారు. ఆ తరువాత 1996 ఫిబ్రవరి 26 నుండి -1998 అక్టోబర్ 12 వరకు సాహెబ్ సింగ్ వర్మ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
వీరిద్దరి తరువాత వీరికి కొనసాగింపుగా అక్టోబర్ 12, 1998 నుండి డిసెంబర్ 3, 1998 వరకు దివంగత నాయకురాలు సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా చేశారు. సుష్మా స్వరాజ్ కేవలం 52 రోజుల పాటే ఆ పదవిలో కొనసాగారు. ఆ తరువాత వరుసగా 15 ఏళ్లు కాంగ్రెస్ దివంగత నాయకురాలు షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేశారు.
ఈసారి ఢిల్లీ సీఎం రేసులో ఢిల్లీ మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ వారసుడు పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఉన్నట్లుండి బీజేపి ఫోకస్ ఢిల్లీకి మహిళను ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన వైపు మళ్లింది. అదే నిజం చేస్తూ రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా నియమించారు. ఆమె ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికవడం ఇదే మొదటిసారి. మొట్టమొదటిసారి శాసనసభలో అడుగుపెట్టడంతోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తారనే ప్రశ్నలు వినిపించాయి. అంతేకాదు... అసలు రేఖా గుప్తానే బీజేపి ఎందుకు ఎంచుకుందనే సందేహాలు కూడా కలిగాయి.
అయితే, బీజేపి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఆమె రాజకీయ అనుభవమే కాకుండా మరో రెండు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి మహిళా సాధికారత గురించి ఎక్కువ ప్రచారం చేసింది. ఇప్పుడు మహిళనే ఢిల్లీ సీఎంగా నియమిస్తే... తమ ప్రచారానికి అర్థం చేకూరుతుందనేది మొదటి ఆలోచనగా బీజేపి నేతలు చెప్పినట్లుగా ఎన్డీటీవీ కథనం స్పష్టంచేస్తోంది.
ఇక రెండో కారణం ఏంటంటే... గతంలో ఢిల్లీ సీఎంగా పని చేసిన ముగ్గురు బీజేపి నేతల్లో ఖురానా పంజాబి వర్గానికి చెందిన వారు. సాహెబ్ సింగ్ వర్మ జాట్ సామాజిక వర్గానికి చెందిన వారు. సుష్మా స్వరాజ్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇక ఈసారి వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారిని, అందులోనూ మహిళను ముఖ్యమంత్రిగా చేస్తే బాగుంటుందనే ఆలోచనతోనే బీజేపి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ వార్తా కథనం పేర్కొంది.
కేవలం వైశ్య సామాజిక వర్గానికి చెందిన మహిళ అనే కాకుండా రాజకీయంగానూ 1996లో ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకునే రోజుల నుండే ఆమె రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఇవన్నీ అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపడానికి కారణాలుగా తెలుస్తోంది.
Also watch this video: Rekha Gupta: దిల్లీ పీఠాన్ని 27 ఏళ్ళ తరువాత బీజేపీ ఎలా దక్కించుకుంది?