రతన్ టాటా వీలునామాలో మోహినీ మోహన్ దత్తాకు రూ.500 కోట్లు... ఎవరీ మోహన్?
Who is Mohini Mohan Dutta? దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా.. వేల కోట్లకు అధిపతి మాత్రమే కాదు గొప్ప మానవతావాది కూడా. సమాజ సేవకుడిగా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. మరణానంతరం వేల కోట్ల ఆస్తిని తాను నెలకొల్పిన ఫౌండేషన్‌లకు, సోదరుడు జిమ్మీ టాటాతో పాటు తన సహాయకులు, పెంపుడు శునకానికి చెందేలా వీలునామా రాసి తన మంచి మనసును చాటుకున్నారు. అయితే తాజాగా ఓ వీలునామా బయటకు వచ్చింది. అందులో ఓ రహస్య వ్యక్తికి వందల కోట్లు ఇవ్వాలని రతన్ టాటా పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆ వీలునామాలో ఉన్న రహస్య వ్యక్తి పేరు చూసి టాటా కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్టు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ రహస్య వ్యక్తి ఎవరో కాదు... జంషెడ్‌పుర్‌కు చెందిన ట్రావెల్స్ వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తా అని తెలుస్తోంది. మోహన్ దత్తా ఆరు దశాబ్దాలకు పైగా రతన్ టాటా దగ్గర నమ్మకంగా పనిచేశారు. తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో భాగమైన తాజ్ సర్వీసెస్‌తో 2013 నుంచి మోహన్ దత్తాకు చెందిన స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీ కలిసి పనిచేస్తోంది.
అంతేకాదు టాటా కుటుంబానికి మోహన్ దత్తా చాలా సన్నిహితంగా ఉండేవారని టాటా గ్రూప్‌కు చెందిన అధికారులు తెలిపారు. రతన్ టాటా మరణించినప్పుడు దత్తా ఆయనతో ఉన్న అనుంబంధం గురించి మాట్లాడుతూ.. రతన్ టాటా 24 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తనకు తెలుసునన్నారు. తాను జీవితంలో ఎదగడానికి ఆయన ఎంతో సాయం చేశారని గుర్తు చేసుకున్నారు. గతేడాది డిసెంబర్‌లో ముంబాయిలోని ఎన్సీపీఏలో నిర్వహించిన రతన్ టాటా జన్మదిన వేడుకలకు దత్తాను ఆహ్వానించినట్టు సమాచారం.