TOP 6 NEWS @ 6PM: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
1) వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ సర్కారు ఎప్పటి నుండో చేస్తోన్న విజ్ఞప్తికి తాజాగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మామునూరు ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు మొదలవనున్నాయి.
జీఎంఆర్‌తో మాట్లాడిన కేంద్ర మంత్రి
వాస్తవానికి శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణం జరిగినప్పుడే ఆ విమానాశ్రయాన్ని డెవలప్ చేసిన జీఎంఆర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం శంషాబాద్ కు 150 కిమీ పరిధిలో మరే ఇతర ఎయిర్ పోర్ట్ రాకూడాదనేది ఆ ఒప్పందంలో ఉన్న అంశాల్లో ఒకటి. ఇంతకాలం పాటు వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి ఈ నిబంధన అడ్డమైందనే అభిప్రాయాలున్నాయి. అయితే, తాజాగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయంలో జీఎంఆర్ సంస్థతో చర్చలు జరిపి ఆ సంస్థ యాజమాన్యాన్ని ఒప్పించినట్లు తెలుస్తోంది.
2) హరీశ్ రావుపై బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు
హరీశ్ రావుపై బాచుపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. హరీశ్ రావుతో పాటు మరో ముగ్గురి నుంచి తనకు ప్రాణహాని ఉందని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్ఎస్ 351 (2), ఆర్ డబ్ల్యూ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
హరీశ్ రావుతో పాటు సంతోష్ కుమార్, రాములు, వంశీపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీశ్ రావు ఏ 2 గా పోలీసులు చేర్చారు. గతంలో తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని హరీశ్ రావుపై చక్రధర్ గౌడ్ పోలీసులను ఆశ్రయించారు. హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3) AP Budget 2025-26: ఈ విద్యా సంవత్సరం నుంచే తల్లికి వందనం
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2025-26 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయించింది. సూపర్ సిక్స్ హామీలో భాగంగా తల్లికి వందనం పథకం కింద బడ్జెట్ లో ప్రభుత్వం రూ.9,407 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద చదువుకునే విద్యార్ధులకు ప్రతి ఏటా రూ. 15 వేలు ఆర్ధిక సహాయం అందించనుంది. ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఈ పథకం వర్తింపచేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తించనుంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనున్నారు. ఒకటి నుంచి 12 తరగతుల వరకు చదివే విద్యార్థులు మాత్రమే ఈ పథకం కింద అర్హులు. విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలో ఈ డబ్బును జమ చేస్తారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం జూన్ లో ప్రారంభం కానుంది. అయితే జూన్ లో స్కూల్స్ ప్రారంభించే సమయానికి ఈ నిధులను తల్లుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4) AP Budget 2025-26: రూ. 3.22 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26 బడ్జెట్ ను ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ప్రవేశపెట్టారు. రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశ పెట్టింది. రెవిన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ. 40,635 కోట్లు, రెవిన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్యలోటు 79,926 కోట్లుగా అంచనా వేశారు.
బడ్జెట్‌లో పలు రంగాలకు కేటాయించిన నిధులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) Uttarakhand Avalanche: బ్రో శిబిరంపై కూలిన మంచు చరియలు.. ప్రమాదంలో 41 మంది ప్రాణాలు
ఉత్తరాఖండ్ బద్రినాధ్ సమీపంలోని చమోలి జిల్లా మన గ్రామంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌కు (BRO) సంబంధించిన కార్మికులు రోడ్డు నిర్మాణం పనులు చేస్తుండగా వారి శిబిరంపై మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మొత్తం 57 మంది కార్మికులు చిక్కుకోగా వారిలోంచి 16 మందిని కాపాడారు. మరో 41 మంది మంచు చరియల కిందే చిక్కుకున్నారు.
వారిని కాపాడేందుకు ఇండియన్ ఆర్మీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు, రెస్క్యూ టీమ్ బలగాలు శ్రమిస్తున్నాయి. ఈ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో సహాయ చర్యలకు, మరిన్ని రెస్క్యూ టీమ్స్ తరలింపులో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) 7 Planets Parade: ఆకాశంలో అద్భుతం... ఇవాళ మిస్ అయితే మళ్లీ 2040లోనే ఆ ఛాన్స్
7 Planets Parade in Sky: ఆకాశంలో ఒక అరుదైన అద్భుతాన్ని చూసే అవకాశం ఇది. ఒకేసారి ఏడు గ్రహాలు ఒకే వరుసలో కనువిందు చేయనున్నాయి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఆకాశంలో ఒకే వరుసలో పరేడ్ చేసేందుకు రెడీ అయ్యాయి.
అయితే, ఈ అద్భుతాన్ని చూసే అవకాశం ఇవాళ ఫిబ్రవరి 28న ఒక్కరోజే ఉంది. ఇవాళ తప్పితే మళ్ళీ మరో 15 ఏళ్ల తర్వాతే ఆ ఛాన్స్ వస్తుంది. అంటే ఇవాళ అంతరిక్షంలో ఆ ఏడు గ్రహాలు పరేడ్ చేయడం మిస్ అయితే, మళ్ళీ 2040 వరకు ఆ అరుదైన దృశ్యాన్ని చూసే ఛాన్స్ రాదు. పూర్తి వివరాల కోసం ఇదిగో ఈ కింది వీడియో చూసేయండి.