కోవిడ్ పరిస్థితులపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ

Ajay Bhalla: నిబంధనల విష‍ంలో సంతృప్తి పడొద్దని హెచ్చరించిన అజయ్ భల్లా

Update: 2021-06-19 12:45 GMT

కేంద్ర హోమ్ శాఖా కార్యదర్శి అజయ్ భల్ల (ఫైల్ ఇమేజ్)

Ajay Bhalla: కోవిడ్ పరిస్థితులపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోన్న వేళ.. నిబంధనల విషయంలో సంతృప్తి పడొద్దని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కొవిడ్ ఆంక్షల విధింపు లేక సడలింపు విషయంలో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు హోంశాఖ సూచించింది. రోజూవారీ క్రియాశీల కేసులు తగ్గుతుండటంతో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. పరిస్థితిని సమీక్షించి ఆంక్షల విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నారు.

కరోనా ఉద్ధృతిని నిశితంగా గమనించి కార్యకలాపాలను జాగ్రత్తగా పున: ప్రారంభించాలన్నారు. టెస్టింగ్, ట్రాకింగ్, వైద్యసేవలు, టీకాలు, నిరంతర నిఘా వంటి నియమాలను తప్పక పాటించాలని లేఖలో పేర్కొన్నారు. దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృంభించకుండా కోవిడ్ నియమావళిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించింది. అయితే కొన్న రాష్ట్రాల్లో ఆంక్షల సడలింపులు మార్కెట్లను రద్దీగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కేసులు పెరుగుతూ, పాజిటివిటీ రేటు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఆరోగ్యశాఖ సూచించిన కట్టడి చర్యలను అమలు చేయాలని పేర్కొంది. సంబంధిత అధికారులను సమన్వయం చేస్తూ ముందుకెళ్లాలని చెప్పింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతను వెల్లడించింది. 

Tags:    

Similar News