Krishna Water Issue: తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతోన్న నీటి వివాదం

Krishna Water Issue: అనుమతి లేకుండా జరుగుతోన్న విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలిపి వేయాలంటూ ఏపీ సర్కార్ లేఖ రాసింది.

Update: 2021-06-30 05:57 GMT

Srisailam Project: (File Image)

Krishna Water Issue: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ సర్కార్ శ్రీశైలం ప్రాజెక్ట్‌లోని నీటిని వినియోగిస్తోందంటూ ఏపీ ప్రభుత్వం మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. జూన్ 1 తేదీ నుంచే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం కేటాయింపుతో సంబంధం లేకుండానే నీటిని వినియోగించుకుంటోందని కేఆర్ఎంబీకి ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు సుమారు 6.9 టీఎంసీల నీటిని ఉపయోగించారని పేర్కొంటూ కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యకార్యదర్శికి ఏపీ ఈఎన్‌సీ నారాయణ రెడ్డి లేఖ రాశారు. ఇప్పటికే ఈ అంశంపై రెండుసార్లు లేఖ రాసినా.. కేఆర్ఎంబీ పట్టించుకోలేదంటూ అసహనం వ్యక్తం చేశారు.

కాగా, ఎగువ నుంచి 17.36 టీఎంసీల మేర నీటి ప్రవాహాలు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తుంటే.. అందులో 40 శాతం నీటిని తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా నీటిని వినియోగించటం సరికాదన్నారు. తదుపరి నీటి వినియోగాన్ని నిలుపుదల చేసేలా తెలంగాణ అధికారులను నిలువరించాలంటూ ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.

Tags:    

Similar News