రవాణాశాఖ కీలక నిర్ణయం

* డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో పలు మార్పులు * విద్యార్హతతో పనిలేకుండా లైసెన్స్‌ జారీ * 40 ఏళ్లు దాటితే మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి

Update: 2021-01-09 05:42 GMT

reprasentationl image

రవాణాశాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కొత్త మోటారు వాహన చట్టానికి అనుగుణంగా మార్పులు చేశారు అధికారులు. ఇప్పటిదాకా డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే కనీసం ఎనిమిదో తరగతి చదివుండాలన్న రూల్ ఉండేది. కానీ, ఇకనుంచి దానికి ఎలాంటి చదువూ అక్కర్లేదు. కనీస విద్యార్హత నిబంధనలను రవాణాశాఖ తీసేసింది. దీంతో కొత్త నిబంధనలతో ప్రమాదాలు తగ్గుముఖం పట్టడమే కాకుండా వాహనదారులకు కొంత ఊరట లభించనుంది.

కేంద్ర ప్రభుత్వ కొత్త మోటారు వాహన చట్టంలో భాగంగా లైసెన్స్ నిబంధనల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా వాహనదారులకు రవాణా శాఖ అవగాహన కల్పిస్తోంది. కేంద్ర మోటార్ వాహన చట్టానికి తగ్గట్టు మార్పులు చేసింది. గత ఏడాది ఫిబ్రవరి 18న అప్పటి ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సునీల్ శర్మ పేరుతో తాజాగా రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు తప్పకుండా అమలు చేయాలని పేర్కొంటూ గత ఏడాది డిసెంబర్లోనే జిల్లా అధికారులకు రవాణా శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

కొత్త రూల్స్‌ ప్రకారం ఎల్లో ప్లేట్‌ అయినా, మామూలు బండ్లు అయినా ఎలాంటి చదువు అవసరం లేకుండానే డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు వీలు దొరికినట్టయింది. అలాగే.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌కు సంబంధించి కూడా అధికారులు కొన్ని మార్పులు చేశారు. ఇప్పటికే లైసెన్స్ ఉన్నవాళ్లు 40 ఏళ్లు దాటితే రెన్యువల్ కోసం తప్పనిసరిగా మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్ పాపారావు తెలిపారు. ఇప్పటిదాకా 50 సంవత్సరాలు వయసు దాటిన వాళ్లే మెడికల్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. అయితే, వయసు పెరిగే కొద్దీ అనారోగ్యాల పాలవుతుండడం, ప్రమాదాలు జరుగుతుండడంతో 40 ఏళ్లు దాటితే మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనల్లో చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు.

మరోవైపు గడువు ముగిసినా లైసెన్స్‌ను రెన్యువల్‌ చేసుకోకుంటే ఇబ్బందులు తప్పవని ట్రాన్స్‌పోర్ట్ అధికారులు హెచ్చరించారు. గడువు ముగిశాక నెల దాకా గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ లోపు చేసుకోకుంటే వెయ్యి రూపాయలు పెనాల్టీ చెల్లించి రెన్యువల్ చేసుకోవచ్చు. ఏడాది దాటినా రెన్యువల్ చేసుకోకపోతే లైసెన్స్‌ను రద్దు చేస్తారు. మళ్లీ లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత డ్రైవింగ్ టెస్టుకు వెళ్లి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

కొత్త మోటారు వాహన చట్టంలో తీసుకువచ్చిన నిబంధనల ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ కొత్త నిబంధనల్లో కొన్ని కఠిన నిర్ణయాలు ఉండడం వల్ల వాహనదారులకు ఇబ్బందులు తప్పేటట్టు లేవు.

Tags:    

Similar News