Tauktae Cyclone 2021: ముంబై నగరానికి దెబ్బ మీద దెబ్బ..తౌక్టే ఎఫెక్ట్

Tauktae Cyclone 2021: తుపాన్ వల్ల ప్రమాదానికి గురైన 'పి 305' అనే వ్యాపార నౌకలో 26 మృతదేహాలు లభ్యమయ్యాయి

Update: 2021-05-20 07:10 GMT
ముంబై పై తుఫాను ప్రభావం (ఫైల్ ఇమేజ్)

Cyclone Tauktae 2021: గుజరాత్, కేరళ, మహారాష్ట్రలను అల్లకల్లోలం చేసిన తౌక్టే తుపాన్ దెబ్బకు ముంబై తీర ప్రాంతం సైతం దారుణంగా దెబ్బ తింది. తుపాను ధాటికి అరేబియా సముద్రతీరంలో ఉన్న నౌకలు సైతం ధ్వంసమయ్యాయి. కరోనా దెబ్బకు ఇప్పటికే వ్యాపారాలు కుదేలవ్వగా.. ముంబైకి కమర్షియల్ గా బిజినెస్ అందించే తీర ప్రాంతంలోని వ్యాపార నౌకలు నష్టపోవటం.. దెబ్బ మీద దెబ్బలా పరిణమించింది.

తుపాన్ వల్ల ప్రమాదానికి గురైన 'పి 305' అనే వ్యాపార నౌకలో 26 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 49 మంది ఆచూకీ లభించలేదు. బలమైన ఈదురు గాలులకు ఓఎన్‌జీసీకి చెందిన నౌక కొట్టుకుపోగా.. అందులో 261 మంది సిబ్బంది ఉన్నారు. తొలుత ఆ నౌకలో 273 మంది ఉన్నట్టు భావించినా.. బుధవారం ఈ సంఖ్యపై ఓఎన్‌జీసీ స్పష్టతనిచ్చింది. ముంబయి తీరానికి 50 నుంచి 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇప్పటి వరకూ 186 మందిని రక్షించారు.

సోమవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగిన తర్వాత ఐదు యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో సహాయక చర్యలు ప్రారంభించారు. సహాయక చర్యల్లో ఐఎన్ఎస్ కోచి, కోల్‌కతా, బియాస్, బెట్వా, తేజ్ యుద్ధ నౌకలు వాటితో పాటు 1500 మంది పాల్గొన్నారు. ఇప్పటి వరకూ 26 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 49 ఆచూకీ తెలియాల్సి ఉంది. వీరంతా ప్రాణాలతోనే ఉంటారని భావిస్తున్నామని నేవీ పేర్కొంది. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి 125 మంది, నాలుగు మృతదేహాలతో ఐఎన్ఎస్ కొచి బుధవారం ముంబయి హార్బర్‌కు చేరుకుందని నేవీ ప్రకటించింది.

ఒడ్డుకు తీసుకొచ్చిన మృతదేహాలను మహారాష్ట్రలోని రత్నగిరికి చెందిన క్రూ సిబ్బంది నిలేశ్, జమిష్ జోసెఫ్, అమోల్ రాజ్, విశాల్ కార్ధేరాగా గుర్తించారు. పోస్ట్‌మార్టం కోసం వీటిని జేజే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రమాదవశాత్తు మృతిచెందినట్టు పోలీసులు కేసు నమోదుచేశారు. రెస్య్కూ ఆపరేషన్‌కు మొత్తం తొమ్మిది యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు వినియోగిస్తున్నట్టు రక్షణశాఖ వెల్లడించింది.

Tags:    

Similar News