Tamil Nadu: చెన్నైలో హై అలెర్ట్.. సీఎం స్టాలిన్, నటి త్రిష ఇళ్లకు బాంబు బెదిరింపులు..!
Tamil Nadu: తమిళనాడులో బాంబు బెదిరింపుల భయం మరోసారి కలకలం రేపింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ప్రముఖ నటి త్రిష నివాసాలతో పాటు, రాజ్‌భవన్, బీజేపీ కార్యాలయాలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
చెన్నైలో హై అలెర్ట్.. సీఎం స్టాలిన్, నటి త్రిష ఇళ్లకు బాంబు బెదిరింపులు..!
Tamil Nadu: తమిళనాడులో బాంబు బెదిరింపుల భయం మరోసారి కలకలం రేపింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ప్రముఖ నటి త్రిష నివాసాలతో పాటు, రాజ్‌భవన్, బీజేపీ కార్యాలయాలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ ఘటనతో చెన్నైలో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది.
తనిఖీలు పూర్తి.. ఫేక్ బెదిరింపులేనని నిర్ధారణ
సమాచారం అందిన వెంటనే పోలీసులు, బాంబ్ డిస్పోసల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్‌తో కూడిన బృందాలు రంగంలోకి దిగాయి. ముఖ్యమంత్రి నివాసం, రాజ్‌భవన్ సహా బెదిరింపులు వచ్చిన అన్ని ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే, ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇవి తప్పుడు బెదిరింపులని తేల్చారు. అయినప్పటికీ, భద్రతా కారణాల రీత్యా ముఖ్యమంత్రి నివాసం, రాజ్‌భవన్ చుట్టూ భద్రతను పెంచి హై అలెర్ట్ ప్రకటించారు.
వరుస బెదిరింపులతో ఆందోళన
గతంలో కూడా సీఎం స్టాలిన్, నటుడు విజయ్ ఇళ్లకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే తరహాలో కాల్స్ రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ వరుస ఫేక్ బెదిరింపులు ప్రజల్లో భద్రతా వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని, నిజమైన ప్రమాదాలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేసే పరిస్థితి రాకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జెడ్-ప్లస్ భద్రత కలిగిన ముఖ్యమంత్రికి ఇలాంటి బెదిరింపులు రావడం పదేపదే జరుగుతుండటం విశ్లేషకులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది.
పోలీసుల దర్యాప్తు..
ఈ బెదిరింపులకు ఈ-మెయిల్ ఐడీలను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఆ మెయిల్ ఐడీల వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, నిందితులు ఐపీ అడ్రస్‌లు మారుస్తుండటంతో వారిని గుర్తించడం కష్టంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ రకమైన కాల్స్‌కు బ్రేక్ పడాలని ప్రజలు కోరుకుంటున్నారు.