Supreme Court: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే.. పిల్లల్ని వెళ్లగొట్టొచ్చు..
Supreme Court: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు వారి ఆస్తులపై ఎలాంటి హక్కు ఉండదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది.
Supreme Court: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు వారి ఆస్తులపై ఎలాంటి హక్కు ఉండదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అంతేకాక, అలాంటి సంతానాన్ని ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టే అధికారం తల్లిదండ్రులకు ఉంటుందని తేల్చిచెప్పింది.
పిల్లల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007 నాటి ‘తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం’ (Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007) అండగా ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
గతంలో ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు పునరుద్ఘాటిస్తూ, జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత వారి కుమారులు, కుమార్తెలదేనని స్పష్టం చేసింది. ఈ బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారి ఆస్తిని పొందే హక్కులేదని తేల్చి చెప్పింది.
గతంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక కేసులో, తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటానని హామీ ఇచ్చి ఆస్తి పొందిన కుమారుడు మాట తప్పడంతో, సుప్రీంకోర్టు ఆ గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి, ఆస్తిపై వృద్ధుల హక్కును పునరుద్ధరించింది.
తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన ట్రైబ్యునళ్లు... కన్నవారిని పట్టించుకోని బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయి.
ఇలాంటి వివాదాల్లో, తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బాధితులకే దక్కేలా ఆదేశించే అధికారం ఈ ట్రైబ్యునళ్లకు ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ తీర్పు వృద్ధాప్యంలో నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులకు చట్టపరమైన భరోసాను, రక్షణను కల్పిస్తుంది.