మహా తీర్పు రేపటికి వాయిదా

Update: 2019-11-25 05:46 GMT

మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. రేపు ఉదయం పదిన్నర గంటలకు గంటలకు తీర్పును వెలువరిస్తామని ప్రకటించింది.

రాజ్‌భవన్ మెజార్టీని నిర్ణయించలేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. కేవలం అసెంబ్లీ మాత్రమే మెజార్టీని నిరూపిస్తుందని శాసనసభలోనే బలపరీక్ష జరగాలని తెలిపింది. ఫడ్నవీస్ ప్రభుత్వానికి అవసరమైనంత సంఖ్యాబలం ఉందా? అని ప్రశ్నించింది. ఫిరాయింపులను అడ్డుకోవాలంటే తక్షణమే బలపరీక్షను నిర్వహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.

ఎన్నికల అనంతరం మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. సీఎల్పీ నేత హోదాలో అజిత్ పవార్ లేఖ ఇచ్చారని మెహతా కోర్టుకు తెలిపారు. 170 మంది ఎమ్మెల్యే జాబితా గవర్నర్ దగ్గరుంది. అందుకే గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచే హక్కు గవర్నర్‌కు ఉందన్న సొలిసిటర్‌ జనరల్‌‌ 170 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ ఇచ్చాక ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేక మరే ఏం చేస్తారని ప్రశ్నించారు. ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌ మద్దతు లేఖల ఆధారంగా గవర్నర్‌ వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని తుషార్‌ మెహతా తెలిపారు. ఇందుకు సంబంధించిన రెండు లేఖలను కోర్టుకు సమర్పించారు.

అనంతరం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. శివసేన తప్పుకోవడం వల్లే రాష్ట్రపతి పాలన వచ్చిందన్నారు. ఆ తర్వాత మద్దతు ఇచ్చేందుకు అజిత్‌ పవార్‌ ముందుకొచ్చారన్నారు. ఒక పవార్‌ తమ వైపు ఉన్నారని.. ఒక పవార్ వారివైపు ఉన్నారన్నారు. వారి మధ్య ఉన్న కుటుంబ కలహాలతో తమకు సంబంధం లేదన్న రోహత్గీ బీజేపీకి మద్దతిస్తున్నట్లు అజిత్‌ పవార్‌ 54 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న లేఖను సమర్పించినట్లు వెల్లడించారు. దాని ఆధారంగానే గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని తెలిపారు.

ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. తెల్లవారుజామున రాష్ట్రపతి పాలన ఎత్తివేయాల్సిన అవసరమేంటీ? మూడు పార్టీల ప్రభుత్వం ఏర్పడకుండా ఇలా వ్యవహరించారన్నారు. అత్యవసర నిర్ణయాలకు కారణాలు కూడా చూపించలేదన్న ఆయన బీజేపీ-శివసేన మధ్య పొత్తు బెడిసికొట్టిందన్నారు. తనకు 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్‌ పవార్‌ అంటున్నారని కానీ ఎన్సీపీ తరఫున అజిత్‌ పవార్‌ ప్రాతినిధ్యం వహించట్లేదని తెలిపే అఫిడవిట్లు కోర్టుకు సమర్పించామన్నారు. బీజేపీకి సంఖ్యా బలం ఉంటే 24 గంటల్లోగా మెజార్టీ నిరూపించుకోవాలని తక్షణమే బలపరీక్ష జరిపేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు.

Tags:    

Similar News