Supreme court about freebies: ఉచితాలు ప్రభుత్వం, ప్రజల కొంప ముంచుతున్నాయా?
ఉచితాలు ప్రభుత్వం, ప్రజల కొంప ముంచుతున్నాయా?
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు ప్రకటించడం మంది పద్దతి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పథకాల వల్ల ప్రజలు పనిచేసేందుకు సిద్దంగా లేరని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కొంతకాలంగా ఉచితాలపై దేశంలో చర్చ సాగుతోంది. అధికారంలోకి వచ్చేందుకు పార్టీలు ఎడాపెడా హమీలు ఇస్తున్నాయా? ఈ హామీలు ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయా? ఈ ట్రెండ్ ఎప్పుడు మొదలైంది? రాష్ట్రాలపై ఎంత భారం పడుతుందో ఇవాళ్టి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.
ఉచితాలపై సుప్రీంకోర్టు ఏమన్నదంటే?
ఉచిత పథకాలు మంచివి కావు. ఈ పథకాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు కష్టపడి పనిచేసేందుకు సిద్దంగా లేరని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రేషన్, డబ్బులు ఫ్రీగా వస్తున్నాయి. పని చేయకుండానే ఇవి లభిస్తున్నాయని కోర్టు తెలిపింది. ఉచితాల ద్వారా మంచి జరుగుతోందా అని కోర్టు ప్రశ్నించింది. ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్దతి సరైంది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ప్రజలకు సౌకర్యాలు అందించాలనే ప్రభుత్వ ఉద్దేశం మంచిదే. కానీ, వారిని దేశాభివృద్దిలో భాగం చేయాలని కోర్టు సూచించింది. ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్దతి సరిగా లేదని జస్టిస్ బీఆర్ గవాయ్, ఆగస్టిన్ జార్జ్ మాసిహ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సంక్షేమ పథకాలతో కార్మికులు పనిచేయడం లేదు
సంక్షేమ పథకాల అమలుతో కార్మికులు పనిచేయడం లేదని ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్.ఎస్. సుబ్రమణ్యన్ అన్నారు. కార్మికుల కొరత తీవ్రంగా ఉందని ఆయన అన్నారు. ఒక్క ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి పనిచేసేందుకు కార్మికులు ఆసక్తి చూపడం లేదన్నారు. స్థానికంగా కార్మికులకు ఆదాయం బాగానే ఉండడం ఒక కారణం. ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు కూడా మరో కారణం కావచ్చు అని ఆయన అన్నారు.
ఉచిత పథకాలు అంటే ఏంటి?
ఏమి ఆశించకుండా ఇచ్చేది ఉచితం. ఉచిత విద్యుత్, ఆరోగ్య సంరక్షణ విద్యను సాంకేతికంగా ఉచితమైనవిగా పరిగణించవచ్చు. ప్రకృతి వైపరీత్యం లేదా ఏదైనా ప్రాణాంతక వ్యాధులు వ్యాపించిన సమయంలో ప్రాణాలను రక్షించే మందులు, ఆహారం లేదా నిధులను అందించి ప్రాణాలను కాపాడవచ్చు. కానీ, సాధారణ సమయాల్లో వాటిని ఉచితాలు అని పిలుస్తారు. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఉపాధి హామీ పథకం, విద్య, ఆరోగ్య సౌకర్యాలకు రాష్ట్రాలకు అందించే సపోర్ట్ లేదా వస్తువులు ఖర్చులు ఉచితాల పరిధిలోకి రావని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ బీ ఐ నివేదిక తెలిపింది. ఉచిత విద్యుత్, నీరు లేదా రవాణా, పెండింగ్‌లో ఉన్న యుటిలిటి బిల్లులు, రుణాల మాఫీ ఇతర ప్రయోజనాలను ఉచితాలుగా చెబుతారు.
ఉచిత పథకాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
ఉచిత పథకాలు తమిళనాడులో ప్రారంభమయ్యాయయని చెబుతారు. అప్పటి మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుమారస్వామి కామరాజ్ 1954 -1963 మధ్యలో విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత భోజనం ప్రవేశపెట్టారు. 1967లో ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకె వ్యవస్థాపకులు సీఎస్ అన్నాదురై ఉచిత పథకాలను ముందుకు తీసుకెళ్లారని అంటారు. తాము ఎన్నికైతే 4.5 కిలోల బియ్యం ఇస్తానని హామీ ఇచ్చారు. 2006లో డీఎంకె ఓటర్లకు కలర్ టీవీలను అందించింది. డీఎంకె, అన్నాడీఎంకెలు పోటీ పడి ఉచితాలు ప్రకటించారు.
2015, 2025 లో దిల్లీ ఎన్నికల్లో ఆప్ ఉచిత హామీలు కురిపించింది. 2015లో ఆప్‌నకు ఈ ఉచితాలు కలిసివచ్చాయి. ఆప్ ప్రభుత్వం పథకాలను కొనసాగిస్తామని దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉచితాల సంస్కృతి ఉంది. 2004 ఎన్నికల్లో రైతులకు ఉచిత విద్యుత్‌ను ఇస్తామని వైఎస్ రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇది అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఒక కారణంగా చెబుతారు. రాష్ట్రం విభజన తర్వాత కూడా ఉచితాలు కొనసాగాయి. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ సీపీ, తెలుగుదేశం పార్టీలు పోటీలు పడి ఉచిత హామీలు ఇచ్చాయి. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా పథకాలను అమలు చేశాయి.
ఉచితాలతో లాభమా? నష్టమా?
ఉచితాలను అమలు చేసేందుకు అవసరమైన నిధులు ఎలా సమకూరుతాయనేది ప్రశ్న. పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేసే డబ్బే ఉచితాల కోసం ఖర్చు చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే మీ కుడి జేబులో డబ్బు తీసుకొని ఎడమ జేబులో పెట్టుకున్నట్టేనని ఆర్ధిక నిపుణులు చెబుతారు. ఇవి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దెబ్బతీస్తాయి. ప్రభుత్వాలను అప్పుల్లోకి నెట్టివేస్తాయని నిపుణులు అంటున్నారు. ఏదైనా రాష్ట్రానికి ఉచితాలకు ఆర్థిక సహాయం చేసే సామర్థ్యం ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. లేకపోతే ఉచితాలు ఆర్ధిక వ్యవస్థకు భారమని నిపుణులు అంటున్నారు. దేశంలోని పేద ప్రజల ఇబ్బందులను ఉచితాలు, ప్రోత్సాహకాల ద్వారా పరిష్కరించలేమనేది కూడా మరో వాదన.
రైతులకు ఉచిత విద్యుత్, ఉచిత నీరు, వ్యవసాయ రుణమాఫీలు, సబ్సిడీలు సరైన పరిష్కారాలు కావనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సంపన్న దేశాల్లో కూడా రైతులకు సబ్సిడీలు అమలు చేస్తారు. కానీ, మనదేశంలో ఇటీవల కాలంలో ఉచితాల కోసం పార్టీలు పోటీపడి హామీలు ఇస్తున్నాయని సీనియర్ జర్నలిస్ట్ సీఆర్ గౌరిశంకర్ చెప్పారు. ఎన్నికల్లో గెలవడం కోసం హామీలిస్తున్నారు. అయితే వాటిని అమలు చేస్తామా లేదా అనేది పక్కన పెడుతున్నారని ఆయన అన్నారు. ఉచితాలు ఒక రకంగా నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉచితాల కోసం ఖర్చెంత?
విద్యుత్ సబ్సిడీలు, మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్, వ్యవసాయ రుణ మాఫీ, ఉచిత ల్యాప్‌టాప్‌లు, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి పథకాలకు ఆర్ధిక సహాయం కోసం కొన్ని రాష్ట్రాలు 96 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అంటే ఆ రాష్ట్రాల జీడీపీలో 2.2 శాతం వరకు ఈ ఖర్చు ఉందని అంచనా.
ఉచితాల వల్ల పెరిగిన అధిక ఖర్చును భరించడానికి రాష్ట్రాలు తమ బడ్జెట్లలో ఆర్థిక లోటు, మూలధనం ఆదాయ వ్యయాన్ని సవరించాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు తమ బడ్జెట్లను సవరించాయి. ఎన్నికల సంవత్సరాల్లో ఉచితాల కోసం రాష్ట్రాలు అధిక ఆర్థిక లోటు, ఆదాయ వ్యయం ఎక్కువగా ఉందని ఎమ్కే రీసెర్చ్ నివేదిక పేర్కొంది.
ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా హామీలు ఇస్తే ఇబ్బంది లేదు. గెలుపు కోసమే ఎన్నికల్లో ఇచ్చే ఉచిత హామీలు అప్పటికప్పుడు పార్టీలకు ఓట్లు కురిపించవచ్చు. కానీ, దాని ప్రభావం ఆర్ధిక పరిస్థితిపై ఎలా ఉంటుందని ఆలోచించడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలుకు ఇబ్బందులు పడుతున్నారు. ఉచితాల విషయంలో పార్టీలతో పాటు ఓటర్లలో కూడా మార్పు రావాలి. అలా అయితేనే అమలుకు సాధ్యమైన హామీలను పార్టీలు మేనిఫెస్టోలో పొందుపరుస్తాయి.