Sunita Williams: నింగికి వీడ్కోలు.. 27 ఏళ్ల నాసా ప్రస్థానానికి సునీతా విలియమ్స్ ముగింపు

Sunita Williams: నాసా స్టార్ వ్యోమగామి సునీతా విలియమ్స్ పదవీ విరమణ. 27 ఏళ్ల కెరీర్, మూడు మిషన్లు, 608 రోజులు అంతరిక్షంలో గడిపిన అరుదైన ప్రస్థానం.

Update: 2026-01-21 04:51 GMT

Sunita Williams: నింగికి వీడ్కోలు.. 27 ఏళ్ల నాసా ప్రస్థానానికి సునీతా విలియమ్స్ ముగింపు

Sunita Williams: అంతరిక్ష పరిశోధన రంగంలో ఒక శకం ముగిసింది. భారత సంతతికి చెందిన నాసా స్టార్ వ్యోమగామి సునీతా విలియమ్స్ (60) పదవీ విరమణ చేస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అధికారికంగా ప్రకటించింది. ఆమె రిటైర్మెంట్ గతేడాది డిసెంబర్ 27 నుంచే అమలులోకి వచ్చినట్లు నాసా వెల్లడించింది.

1998లో నాసాలో చేరిన సునీతా విలియమ్స్, 27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో మూడు కీలక అంతరిక్ష మిషన్లలో పాల్గొన్నారు. ఈ కాలంలో ఆమె భూమి కక్ష్యలో మొత్తం 608 రోజులు గడిపారు. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన మహిళా వ్యోమగాముల్లో ఒకరిగా, అలాగే అత్యధిక సార్లు స్పేస్‌వాక్ చేసిన మహిళగా ఆమె అరుదైన రికార్డులు నెలకొల్పారు.

నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మాన్, సునీతా విలియమ్స్‌ను “మానవ అంతరిక్ష ప్రయాణాలకు మార్గదర్శి”గా అభివర్ణించారు. అంతరిక్షంలో మారథాన్ రన్ చేసిన తొలి వ్యోమగామిగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు.

సునీత కెరీర్‌లో చివరి మిషన్ అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. 2024 జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా కేవలం 10 రోజుల ప్రయాణం కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె, నౌకలో సాంకేతిక లోపాల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. ఆ ప్రయాణం 286 రోజుల సుదీర్ఘ నిరీక్షణగా మారింది. చివరికి 2025 మార్చి 18న స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా సునీత భూమికి క్షేమంగా చేరుకున్నారు.

సునీతా విలియమ్స్ పదవీ విరమణ చేసినప్పటికీ, ఆమె చేసిన పరిశోధనలు భవిష్యత్తులో చేపట్టనున్న ఆర్టెమిస్ మిషన్‌, అంగారక గ్రహ యాత్రలకు పునాదిగా నిలుస్తాయని నాసా పేర్కొంది. ప్రస్తుతం ఆమె భారత్ పర్యటనలో ఉన్నట్లు సమాచారం. ఇస్రోతో కలిసి భవిష్యత్తు ప్రాజెక్టులకు సలహాలు అందించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Tags:    

Similar News