రాజకీయ నేతకు ఎస్పీ ఈషా సింగ్ హెచ్చరిక
తమిళిగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ నేత బుస్సీ ఆనంద్‌ను పుదుచ్చేరి ఎస్పీ ఈషా సింగ్ గట్టిగా హెచ్చరించారు.
పుదుచ్చేరి: తమిళిగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ నేత బుస్సీ ఆనంద్‌ను పుదుచ్చేరి ఎస్పీ ఈషా సింగ్ గట్టిగా హెచ్చరించారు. పుదుచ్చేరిలో అనేకమంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పుదుచ్చేరిలో టీవీకే బహిరంగ సభ కోసం నిబంధనలతో అనుమతి ఇచ్చారు. ఈ సభకు 5 వేల మందికి మాత్రమే అనుమతి ఇస్తూ, ఆ మేరకు ఆహ్వానితుల పాస్‌లు కూడా పంపిణీ చేశారు. పాస్‌లున్నవారిని మాత్రమే అనుమతించాలని పోలీసులకు సూచనలు వెళ్లాయి. అయితే, సభా ప్రాంగణం వద్దకు వచ్చిన బుస్సీ ఆనంద్.. పాసుల్లేని వారిని కూడా లోనికి పంపించాలని పోలీసులపై ఒత్తిడి చేశారు. గమనించిన ఎస్పీ ఈషా సింగ్ అతడిని గట్టిగా మందలించారు. ‘‘అక్కడ 41 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఇక్కడ కూడా అవే వేషాలా? అనుమతి మేరకు నడుచుకోండి. సభకు భద్రత కల్పించడమెలాగో నాకు తెలుసు. మీలాంటి వారి సలహాలు నాకు అక్కర్లేదు. జాగ్రత్తగా మసలుకోండి’’ అని ఆనంద్‌ను ఎస్పీ ఈషా సింగ్ హెచ్చరించారు. ఎవరి మెప్పు కోసమో ఇష్టానుసారంగా జనాలను తరలిస్తానంటే కుదరదని స్పష్టం చేశారు.
రద్దీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ముందస్తు ఏర్పాట్లు చేశామని, పార్టీ అధినేత మెప్పు కోసం పాసులు లేనివారిని అనుమతించాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు. కరూర్‌లో జరిగిన రోడ్‌షోలో 41 మంది ప్రాణాలు కోల్పోవడానికి మీ నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆనంద్ ని నిలదీశారు. ఎస్పీ ఈషా సింగ్ హెచ్చరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారంతా ఈషా సింగ్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఆమె రాజకీయ నాయకులకు సింహ స్వప్నమని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.