న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రాణాలకు తెగించి భారత సైన్యానికి అండగా నిలిచిన పంజాబ్‌కు చెందిన శ్రవణ్ సింగ్ సాహసాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. క్లిష్ట పరిస్థితుల్లో సైనికులకు పాలు, నీరు, టీ వంటివి అందిస్తూ సాయపడిన ఈ 10 ఏళ్ల బాలుడికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 'ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్' అందజేశారు. శ్రవణ్ అంకితభావాన్ని గౌరవిస్తూ, భవిష్యత్ లో శ్రవణ్ చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను భారత సైన్యం భరిస్తోంది.
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లోని చక్ తరణ్ వాలి గ్రామంలో తన ఇంటికి సమీపంలో ఉన్న పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించిన భారత సైన్యానికి శ్రవణ్ సింగ్ క్రమం తప్పకుండా సేవ చేశాడు. ‘‘పాకిస్థాన్‌పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనప్పుడు, సైనికులు మా గ్రామానికి వచ్చారు. నేను వారికి సేవ చేయాలని అనుకున్నాను. నేను వారికి ప్రతిరోజూ పాలు, టీ, మజ్జిగ, ఐస్ తీసుకువెళ్లేవాడిని’’ అని బాలుడు మీడియాతో చెప్పారు. 10 ఏళ్ల బాలుడి సేవ దేశభక్తిని వయసుతో కాదు, చర్యలతో నిర్వచిస్తాయి అని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు.
'ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్' అనేది ధైర్యసాహసాలు, కళ – సంస్కృతి, పర్యావరణం, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలలో అసాధారణ ప్రతిభ చూపిన పిల్లలకు భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక జాతీయ గౌరవం. డిసెంబర్ 26న వీర్ బాల్ దివాస్ ప్రాముఖ్యత గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, భారతీయులంతా పూజించే పదవ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ జీ, ఆయన నలుగురు కుమారులు సత్యం, న్యాయానికి మద్దతుగా పోరాడుతూ అత్యున్నత త్యాగాలు చేశారని అన్నారు.