12 ఏళ్ల బాలుడికి గొలుసులతో బేడీలు: నాగ్‌పూర్‌లో కన్నవారి అమానుషం.. ఎందుకంటే?
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణ పేరుతో కన్న తల్లిదండ్రులే తమ 12 ఏళ్ల కుమారుడిని ఇనుప గొలుసులతో బంధించిన ఉదంతం స్థానికంగా కలకలం రేపింది.
ఘటన వివరాలు:
సౌత్ నాగ్‌పూర్‌కు చెందిన ఒక దంపతులు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి 12 ఏళ్ల కుమారుడు తరచూ పాఠశాలకు వెళ్లకుండా బయట తిరగడం, ఇంట్లో చెప్పకుండా పారిపోవడం వంటి పనులు చేస్తున్నాడు. అంతేకాకుండా, ఇతరుల సెల్ ఫోన్లు దొంగిలిస్తున్నాడనే ఆరోపణలతో తల్లిదండ్రులు అతనిపై ఆగ్రహం పెంచుకున్నారు.
కొడుకు ప్రవర్తన మార్చుకోవడం లేదనే నెపంతో తల్లిదండ్రులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు.
గత రెండు నెలలుగా ఆ దంపతులు ఉదయం పనికి వెళ్లేటప్పుడు బాలుడి కాళ్లు, చేతులకు ఇనుప గొలుసులు వేసి ఇంటి బయట కట్టేసి తాళం వేసేవారు.
సాయంత్రం వారు పని నుంచి తిరిగి వచ్చే వరకు ఆ బాలుడు ఎండలో, వానలో అక్కడే గొలుసులతో బందీగా ఉండేవాడు. గొలుసుల రాపిడి వల్ల బాలుడి చేతులు, కాళ్లపై తీవ్రమైన గాయాలయ్యాయి.
అధికారుల జోక్యం:
బాలుడి దీనస్థితిని గమనించిన స్థానికులు జిల్లా మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు. బాలుడిని గొలుసుల నుంచి విడిపించి సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం అతడిని షెల్టర్ హోమ్ కు తరలించి, వైద్య సాయం అందిస్తూ కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
బాలుడి పట్ల అమానుషంగా ప్రవర్తించిన తల్లిదండ్రులపై జువైనల్ జస్టిస్ యాక్ట్ (Juvenile Justice Act) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.