నేటితో ముగియనున్న శశికళ శిక్షా కాలం

* అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న శశికళ

Update: 2021-01-27 02:43 GMT

Shashikala (file image)

తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆప్తురాలు శశికళ ఇవాళ విడుదల కానునున్నారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లుగా ఆమె బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జైలు అధికారుల సమాచారం మేరకు జైలు శిక్ష పూర్తయింది. ప్రస్తుతం కరోనాతో విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. అస్పత్రిలోనే విడుదలకు సంబంధించిన అన్ని ఫార్మాలీస్‌లను పూర్తిచేస్తామని పోలీసులు తెలిపారు. అయితే ఆమె విడుదలైనప్పటికీ పూర్తిగా కోలుకున్న తర్వాతే చెన్నైకి బయలుదేరనున్నారు. ప్రస్తుతం చిన్నమ్మ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.

శశికళ విడుదల కాగానే భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు. పరప్పణ అగ్రహారం జైలు నుంచి చెన్నై వరకు కనీసం వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్ మున్నేట్రకళగం అధినేత దినకరన్ బృందం ఏర్పాట్లు చేస్తోంది. శశికళ జైలు నుంచి బయటకు రాగానే రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. అయితే చిన్నమ్మ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా..? లేదా అనేదానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎదైనా కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించిన వారు ప్రత్యక్ష ఎన్నికల్లో నాలుగేళ్ల పాటు పోటీ చేసేందుకు అనర్హులు. దీంతో ఆమె ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నట్లు శశికళ సన్నిహితులు చెబుతున్నారు. మరి చిన్నమ్మ విడుదలయ్యాక ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Full View


Tags:    

Similar News