Road Accident: కుంభమేళా నుంచి తిరిగివస్తూ రోడ్డు ప్రమాదం.. ఏడుగురు హైదరాబాద్ వాసులు దుర్మరణం
Road Accident: యూపీలోని ప్రయాగ్ రాజ్ లో కుంభమేళాకు వెళ్లని కొందరు తెలుగు యాత్రికులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఈఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారని అధికారులు వెల్లడించారు. మరణించినవారంతా హైదరాబాద్ లోని నాచారం వాసులుగా గుర్తించారు.
జబల్ పుర్ లోని సిహోరా సమీపంలో మంగళవారం ఉదయం 8.30గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ హైవే పైకి రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది యాత్రికులు బస్సులో చిక్కుకుపోయారు. వారిని స్థానికులు కాపాడారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సిహోరా ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన వాహనం నెంబర్ AP29 W 1525గా గుర్తించారు. మినీ బస్సు రిజిస్ట్రేషన్ ఆధారంగా ప్రమాదానికి గురైనవారు ఏపీ వాసులు కావచ్చని మొదట పోలీసులు భావించారు. ఆ తర్వాత డెడ్ బాడీల వద్ద దొరికిన ఆధారాలతో వారు నాచారం వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారి పేర్లు, ఇతర వివరాలు ఇంకా తెలియలేదు.