హిమాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు
* కొత్తగా ఎంపికైన సభ్యుల ఏకాభిప్రాయంతోనే సీఎం అభ్యర్థి
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో తర్జన భర్జనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడం తలనొప్పిగా మారింది. నిన్న ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమై శాసన సభాపక్షనేతను ఎంపిక చేసుకోడానికి కసరత్తుచేశారు. ఏకాభిప్రాయంతో ఉమ్మడి వ్యక్తినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, హరియాణా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపికచేయడానికి కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై ఎవరు ముఖ్యమంత్రి కాదలచుకున్నారోనని సమ్మతం తెలపాలను కోరారు. సీఎం రేసులో పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్, సుఖ్విందర్ సింగ్ సుఖు, ముకేశ్ అగ్నిహోత్రి పేర్లు ముందంజలో ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టగలిగే సత్తా తనకు ఉందని వ్యాఖ్యానించారు. దివంగత నేత వీరభద్ర సింగ్ పేరు వల్లే హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ 40 సీట్లు సాధించిందని ఆమె పేర్కొన్నారు. అలాంటిది ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టడం సరికాదన్నారు.