శబరిమలలో మకర జ్యోతి దర్శనం

* భక్తుల జయధ్వనులతో ప్రతిధ్వనించిన శబరి గిరులు * స్వర్ణాభరణాలతో స్వామివారికి ప్రత్యేక అలంకరణ * అతి నిరాడంబరంగా మకరవిలక్కు ఉత్సవాలు

Update: 2021-01-14 14:28 GMT

 Makara Jyothi

పశ్చిమ కనుమలు పులకించి పోయాయి. సహ్యాద్రి పర్వత శ్రేణులు అచంచలమైన భక్తిభావంతో పరవళ్ళు తొక్కాయి. జ్యోతి స్వరూపునిగా జగతికి కనిపించిన ఆ అభయ స్వరూపునికి లక్షలాది చేతులు మొక్కాయి. వేల గొంతుకలు బిగ్గరగా స్వామియే శరణం అయ్యప్ప అని నినదిస్తుంటే.. శబరి గిరులు తరించి పోయాయి. మకర విళక్కు సుందర దృశ్యాన్ని తిలకించి అయ్యప్ప భక్తులు తన్మయులయ్యారు.

ఒక్కసారిగా జయధ్వనులు మిన్నంటాయి. లక్షలాది గొంతుకలు ఒక్కటై ఆ దివ్య మంగళ రూపాన్ని ధ్యానించాయి. అయితే ఈసారి భక్తుల రద్దీగా తక్కువగానే ఉంది. ఏటా ఈ సమయానికి సుమారు 10 లక్షల మందికి పైగానే అయ్యప్ప భక్తులు మకర జ్యోతిని దర్శించుకుంటారు. కరోనా కారణంగా కొన్ని నిబంధనలు అమలులో ఉండడం జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నెగటివ్ సర్టిఫికెట్ ను సమర్పించాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేయడంతో భక్తుల సంఖ్య బాగా తగ్గింది.

మకరవిళక్కు ఉత్సవాల్లో భాగంగా అయ్యప్ప మూలమూర్తికి ప్రత్యేక పూజలు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్వామికి ఎంతో ఇష్టమైన స్వర్ణాభరణాలు తీసుకు వచ్చే కార్యక్రమం కూడా వేడుకగా సాగింది. పందలంలోని ధర్మస్థ ఆలయం నుంచి సన్నిధానం వరకు ఊరేగింపు సాగింది. ఈ కార్యక్రమంలో కూడా అతి తక్కువ మంది భక్తులు మాత్రమే పాల్గొన్నారు.

 సాయం సంధ్య అలముకోగానే ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. దివ్య జ్యోతి కాంతులీనుతూ దర్శనం ఇవ్వడంతో భక్తి పారవశ్యం ఒ్కసారిగా తొణికిసలాడింది. అతి తక్కువ మంది భక్తులు, అర్చకులు, అధికారుల సమక్షంలో మకరవిలక్కు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అతి నిరాడంబరంగా ఈ ఉత్సవాలు సాగడం శబరిమల చరిత్రలోనే ఇది తొలిసారి తొలిసారి.

 అయ్యప్ప స్వామి వారికి అత్యంత ఇష్టమైన దినం..మకర సంక్రమణం. ఇవాళ తాను ఆకాశంలో జ్యోతిరూపంలో దర్శనం ఇస్తానని స్వామి వారే వెల్లడించినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే అయ్యప్ప మాల ధరించిన ప్రతి భక్తుడు మకర సంక్రాంతి రోజున మకరజ్యోతిని చూడాలని ఆశపడుతుంటాడు. ఈ ప్రక్రియ అనంతరం కొద్ది రోజులు మాత్రమే ఆలయాన్ని తెరచి ఉంచుతారు. ఈనెల 20న తిరిగి ఆలయాన్ని మూసి వేయనున్నారు. 

Tags:    

Similar News