Riots in Bangaluru: భగ్గుమన్న బెంగళూరు..ఎమ్మెల్యే ఇంటిపై దాడి! ఇద్దరి మృతి!!

Riots in Bangaluru: తమ వర్గం వారిని అవమాన పరిచారని ఆరోపిస్తూ బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభ్యుని ఇంటిపై దాడి

Update: 2020-08-12 04:01 GMT
Bangalore riots

బెంగళూరు: ఉద్యాన నగరి బెంగళూరు ఒక్కసారిగా భగ్గుమంది. బెంగళూరు తూర్పు ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. రాత్రంతా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. కాంగ్రెస్ శాసన సభ్యుడి ఇంటిపై ఒక వర్గానికి చెందిన వారు మూకుమ్మడిగా దాడి చేశారు. ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. విధ్వంసాన్ని సృష్టించారు. ఇంటికి నిప్పు పెట్టారు. దాడులకు పాల్పడిన వారిని అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అల్లర్లు తీవ్రరూపం దాల్చాయి. వాటిని నియంత్రించడానికి రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్‌ను విధించాల్సి వచ్చింది. అదనపు బలగాలను తరలించాల్సి వచ్చింది.

కాల్పుల్లో ఇద్దరు దుర్మరణం..

వారిని అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. దీనితో ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. రాళ్ల వర్షాన్ని కురిపించారు. ప్రతిదాడులకు దిగారు. పోలీస్‌స్టేషన్‌నూ ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 60 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. బెంగళూరు కేజీ హళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కావల్ బైరసంద్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే అదనపు బలగాలను మోహరింపజేశారు. డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్‌ను విధించారు.

కాల్పులు జరిపేంతటి స్థాయిలో అల్లర్లు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం.. ఫేస్‌బుక్‌లో చేసిన ఓ పోస్ట్. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా ఆయన పోస్ట్ ఉండటమే దీనికి కారణమని పోలీసులు చెబుతున్నారు. అఖండ శ్రీనివాస మూర్తి మేనల్లుడు నవీన్ ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా ఉన్న ఈ పోస్ట్‌ను చూసిన వెంటనే వందలాది మంది ఈ దాడికి పాల్పడ్డారు. కావల్ బైరసంద్ర, కేజీ హళ్లి ప్రాంతాల్లో ఏం జరుగుతున్నదో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా వందలాది మంది తరలి రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అల్లరి మూకులను నియంత్రించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో మొదట గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ.. వారు అదుపులోకి రాలేదు. దీనితో నేరుగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డరు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితి కాల్పుల వరకూ వెళ్లడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరింపజేశారు.

Tags:    

Similar News