ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు: మరో ఐదు ముఖ్యాంశాలు

వల్లభనేని వంశీ అక్రమాల ఆరోపణలపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Update: 2025-02-24 13:39 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు: మరో ఐదు ముఖ్యాంశాలు

1.వల్లభనేని వంశీ అక్రమాల ఆరోపణలపై సిట్ ఏర్పాటు

వల్లభనేని వంశీ అక్రమాల ఆరోపణలపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జీవీజీ ఆశోక్ కుమార్ ఈ సిట్ కు నాయకత్వం వహిస్తారని చంద్రబాబు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ మైనింగ్, భూకబ్జా ఆరోపణలపై సిట్ విచారణ చేయనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జ్యుడిషీయల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులోనే వంశీని పోలీస్ కస్టడీకి అనుమతించింది కోర్టు.

2.ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. తెలంగాణలో ఐదు, ఆంధ్రప్రదేశ్ లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మార్చి 20న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఈ ఎన్నికలకు సంబంధించి మార్చి 3న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా హసన్ ఎఫెండీ పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగా కృష్ణమూర్తి రామారావు, ఆశోక్ బాబు, తిరుమలనాయుడు, యనమల రామకృష్ణుడు పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో ఈ ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఉన్న సంఖ్య ఆధారంగా ఆ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీలు దక్కే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల ఆధారంగా ఆ పార్టీకి ఒక్క సీటు దక్కనుంది.ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు స్థానాలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే దక్కే చాన్స్ ఉంది. ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ఉన్న సభ్యులు 11 మందే. ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలంతో ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం లేదు.

3.ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ సంచలన ఆరోపణలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్ ను బీజేపీ కాపాడుతోందని ఆయన ఆరోపించారు. ఈ కేసును అడ్డు పెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతును బీజేపీ తీసుకుంటుంది ఆయన విమర్శించారు. అమెరికాకు పారిపోయిన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును కేంద్రం ఎందుకు రప్పించడం లేదని ఆయన ప్రశ్నించారు. మరో వైపు ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేర్చుకొని మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయా? ఇప్పుడు ఉప ఎన్నికలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు.

4.రెండు వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై ట్రంప్ వేటు

రెండు వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వేటు వేశారు. కొందరు ఉద్యోగులను బలవంతంగా సెలవుల్లో పంపారు.ఈ విషయాన్ని యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ వెబ్ సైట్ నోటీస్ తెలుపుతోంది. ఉద్యోగుల తొలగింపునకు ఫెడరల్ జడ్జి అనుమతించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి యూఎస్ ఎయిడ్ ను అమెరికా ప్రభుత్వం నిలిపివేసింది.

5.  మాతో టచ్ లో 32మంది ఆప్ ఎమ్మెల్యేలు: కాంగ్రెస్

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 32 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని పంజాబ్ కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ సింగ్ బజ్వా చెప్పారు. మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లోకి వెళ్లే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలే కాదు మంత్రులు కూడా తమతో టచ్ లో ఉన్నారని ఆయన చెప్పారు. ఆప్ పంజాబ్ చీఫ్ అమన్ అరోడాకు కూడా ఈ విషయం తెలుసునన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై పంజాబ్ ఆప్ చీఫ్ మండిపడ్డారు. ఈ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకుడు బజ్వానే బీజేపీలో చేరే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

6.ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవి రెడ్డి రాజీనామా

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు జీవీ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. అంతేకాదు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అంతేకాదు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి హోదా నుంచి తప్పుకుంటున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గా ఆయన వెయ్యి మందిని తొలగించారు. అయితే వారిని ఇంతవరకు రిలీవ్ చేయలేదు. దీనిపై ఫైబర్ నెట్ ఎండీపై జీవీ రెడ్డి ఆరోపణలు చేశారు.

Tags:    

Similar News