Corona Delta Variant: కరోనా డెల్టా రకం.. డెల్టా ప్లస్‌గా రూపాంతరం

Corona Delta Variant: అమెరికా, యూరప్‌ దేశాల్లో డెల్టా ప్లస్‌ బాధిత కేసులు

Update: 2021-06-19 06:15 GMT

Representational Image

Corona Delta Variant: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఫస్ట్ వేవ్‌, సెకండ్‌ వేవ్‌, ఇప్పుడు థర్డ్‌ వేవ్‌ అంటూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. మొదటి వేవ్‌ చివరిలో ఏర్పడిన కరోనా వేరియంట్లు.. మ్యుటేట్‌ అయి డెల్టా వేరియంట్‌గా రూపాంతరం చెందడంతో రెండో వేవ్‌కు కారణమైంది. ఇప్పుడా డెల్టా రకం మరింతగా మ్యుటేషన్‌ చెంది డెల్టా ప్లస్‌ ఏవై-1గా మారింది. ఇప్పటికే అమెరికా, యూరప్‌ దేశాల్లో దీని తాలూకు కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇదే వైరస్‌ కారణంగా భారత్‌కు మూడో వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్‌ ఈ విషయాన్ని హెచ్చరించింది.

కరోనా రెండో వేవ్‌ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా డెల్టా వేరియంట్‌ ఇప్పుడిప్పుడే నియంత్రణలోకి రావడంతో కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. కానీ ఇంతలోనే డెల్టా వేరియంట్‌ మ్యుటేషన్‌ చెంది.. కొత్తగా డెల్టా ప్లస్‌ వేరియంట్‌గా మారిందని పరిశోధకులు ప్రకటించారు. ఈ వేరియంట్‌ కారణంగా మూడో వేవ్‌ రావొచ్చన్న అంచనాలతో మరోసారి ఆందోళన మొదలైంది. మధ్యప్రదేశ్‌లో తొలిసారిగా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసు నమోదైంది. భోపాల్‌లోని ఓ మహిళలో ఈ వేరియంట్‌ను గుర్తించిన అధికారులు.. ప్రైమరీ కాంటాక్టులను గుర్తించే పనిలో పడ్డారు. అటు జార్ఖండ్‌లోనూ డెల్టా ప్లస్‌ కేసులను గుర్తించినట్లు ఆ రాష్ట్రం పేర్కొంది.

డెల్టా ప్లస్‌ వల్ల ప్రమాదం ఎంతవరకు ఉంటుంది, వ్యాక్సిన్లతో ప్రయోజనం ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేశంలో ఇప్పటికే చాలామంది డెల్టా వేరియంట్‌ బారినపడి కోలుకున్నందున.. డెల్టా ప్లస్‌ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వైద్య నిపుణులు, పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇక.. దేశంలో కరోనా రెండో వేవ్‌ మొదలైన మహారాష్ట్రలోనే మూడో వేవ్‌ కూడా మొదలుకావొచ్చన్న అంచనాల నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ కూడా ఇదే హెచ్చరిక చేసింది. కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కారణంగా మూడో వేవ్‌ రావొచ్చని అంచనా వేసింది. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారని, ఇలాగే కొనసాగితే ‎మరో నెల రోజుల్లోనే మూడో వేవ్‌ మొదలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది మహారాష్ట్ర సర్కార్‌. 

Tags:    

Similar News