RBI Repo Rate: కీలక వడ్డీ రేట్లు యథాతథం - ఆర్‌బీఐ
RBI Repo Rate: కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
Shaktikanta Das: (File Image)
RBI Repo Rate: కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు, వాటిలో ఎలాంటి మార్పులు లేవని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ప్రకటించింది. ఈ రోజు ఢిల్లీలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష వివరాలను తెలిపారు. రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగుతాయని చెప్పారు. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సాధించడం కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
కరోనా కారణంగా ఆర్థిక వృద్ధి, రికవరీపై అనిశ్చితి నెలకొందని చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిని 10.5, సీపీఐ ద్రవ్యోల్బణాన్ని 5.1 శాతంగా అంచనా వేసినట్లు ఆయన వివరించారు.ఈ మేరకు రేట్లను యథాతథంగా ఉంచేందుకు మానిటరీ పాలసి కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి కొనసాగుతుండడంతో రెపో రేటుపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.