Wedding at Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్‌లో పూనమ్ పెళ్లికి ముర్ము గ్రీన్ సిగ్నల్.. భవన్ చరిత్రలోనే ఫస్ట్ టైం..!
రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. రాష్ట్రపతి వ్యక్తిగత భద్రతాధికారిగా విధులు నిర్వహిస్తున్న పూనమ్ గుప్తా వివాహం జరుపుకునేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక అనుమతిచ్చారు.
రాష్ట్రపతి భవన్‌లో పూనమ్ పెళ్లికి ముర్ము గ్రీన్ సిగ్నల్.. భవన్ చరిత్రలోనే ఫస్ట్ టైం..!
Wedding at Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. రాష్ట్రపతి వ్యక్తిగత భద్రతాధికారిగా విధులు నిర్వహిస్తున్న పూనమ్ గుప్తా వివాహం జరుపుకునేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక అనుమతిచ్చారు. దీంతో ఈ నెల 12న పూనమ్ గుప్తా వివాహం రాష్ట్రపతి భవన్‌లోని మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్‌లో జరగనుంది. జమ్మూకశ్మీర్‌లో సీఆర్ పీఎఫ్ అసిస్టెంట్ కమాండెండ్‌గా సేవలందిస్తున్న అవనీశ్ కుమార్‌తో పూనమ్ గుప్తా ఏడడుగులు వేయనున్నారు.
దేశ ప్రథమ పౌరుడి అధికారిక నివాసమే రాష్ట్రపతి భవన్. దిల్లీ నడి బొడ్డున ఉన్న సువిశాలమైన విస్తీర్ణంలో రాజ భవనాన్ని తలపించేలా ఉంటుంది. అలాంటి భవనాన్ని ఒక్కసారైనా చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అక్కడ అన్నీ అధికారిక కార్యక్రమాలే తప్పా ప్రైవేటు కార్యకలాపాలకు అక్కడ చోటే లేదు. అలాంటి రాష్ట్రపతి భవన్ ఇప్పుడు పెళ్లి వేడుకకు వేదిక కావడం విశేషం. అది కూడా భవన్ చరిత్రలో తొలిసారి కావడం గమనార్హం.
రాష్ట్రపతి ముర్ముకు వ్యక్తిగత భద్రతా అధికారిగా పూనమ్ గుప్తా డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు. వధూవరులిద్దరూ సీఆర్ పీఎఫ్ అధికారులే. ఈ కారణంగానే వీరి పెళ్లి వేడుకకు రాష్ట్రపతి భవన్ వేదికగా నిలుస్తోందని సమాచారం. రాష్ట్రపతి భవన్‌లో ఇప్పటివరకు ఓ ప్రైవేట్ కార్యక్రమం కూడా జరగలేదు. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న ఇద్దరూ కూడా దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తున్న సీఆర్ పీఎఫ్ అధికారులు. వారిలో ఒకరు రాష్ట్రపతి ముర్ముకు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కారణంగా రాష్ట్రపతి వీరి పెళ్లికి ప్రత్యేక అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది.
భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఈ వివాహ వేడుకకు అతికొద్ది మంది బంధువులు, అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందినట్లు సమాచారం. మధ్యప్రదేశ్‌కు చెందిన పూనమ్ గుప్తా 2018లో యూపీఎస్సీ నిర్వహించిన సీఏపీఎఫ్ పరీక్షలో 81వ ర్యాంక్ సాధించారు. ఇటీవల జరిగిన గణతంత్ర వేడుకల్లో సీఆర్ పీఎఫ్ మహిళా దళానికి పూనమ్ గుప్తా సారథ్యం వహించారు. రాష్ట్రపతి భవన్‌లో తొలిసారిగా ఓ అధికారి పెళ్లి చేసుకోబోతున్నారంటే పూనమ్ అంకితభావానికి, ప్రతిష్టకు నిదర్శనం. ఇక రాష్ట్రపతి భవన్‌లో పూనమ్ గుప్తా పెళ్లి అని తెలియడంతో.. తన సొంత జిల్లా శివపురితో పాటు మధ్యప్రదేశ్ వ్యాప్తంగా సంతోషం వెల్లువెత్తుతోంది.