Weather Report: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

* మరో 24 గంటలు వానలపై అలర్ట్

Update: 2022-11-23 03:24 GMT

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Weather Report: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు వర్ష సూచన ఉంది. తెలంగాణలో తూర్పు, ఈశాన్య భారత్ నుంచి చల్లని గాలులు వీస్తున్నాయి. వాటి వల్ల వాతావరణం అతి చల్లగా మారి ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏపీలో వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలహీనపడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా మారిందని వాతావరణశాఖ తెలిపింది. ఇది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో కొనసాగుతోంది. అక్కడ నుంచి నెమ్మదిగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ రెండిటి ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాలో ఒకటిరెండు చోట్ల, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వానలు పడుతున్నాయి. రాయలసీమలోని చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో కూడా వానలు కురిశాయి.

ఏపీలో వర్షాలపై ఏపీ విపత్తు సంస్థ అలర్ట్ చేసింది. వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశలో దక్షిణకోస్తాంధ్ర -ఉత్తర తమిళనాడు తీరాల వైపు కదులుతూ, రానున్న 6 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల సంస్థ సూచించింది. వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. వాకాడు, కోట ప్రాంతాల్లోని సముద్ర తీరంలో అలల ఉధృతి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు రావడంతో స్థానికులు భయపడుతున్నారు. 

Tags:    

Similar News