Tauktae: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Tauktae: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ‘తౌక్టే’ తుపానుగా మారిందని భారత వాతావరణశాఖ తెలిపింది.

Update: 2021-05-15 14:45 GMT

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన (ఫొటో దిహన్స్ ఇండియా)

Tauktae: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం 'తౌక్టే' తుపానుగా మారిందని భారత వాతావరణశాఖ తెలిపింది. గోవాకు దక్షిణ నైరుతి దిశగా 330 కి.మీ. దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. రానున్న 6 గంటల్లో తీవ్ర, 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని హెచ్చరించింది. ఉత్తర వాయవ్య దిశగా ఈ తుఫాన్ ప్రయాణించి మరింత బలపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. మే 18న గుజరాత్‌ వద్ద తీరం దాటొచ్చని అధికారులు పేర్కొన్నారు.

ఈ తుపాను కారణంగా ఏపీలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, యానాం, రాయలసీమలలో ఈదురు గాలులు, తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోనూ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను ప్రభావం తెలంగాణపై ఈ రోజు, రేపూ ఉండనుంది.

ఈనెల 31నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం శుక్రవారం పేర్కొంది. రుతుపవనాలు మొట్టమొదట ఈనెల 22న దక్షిణ అండమాన్‌ సముద్ర ప్రాంతానికి చేరనున్నాయి. అనంతరం వాయవ్య దిశగా ముందుకు కదులుతాయని ఐఎండీ పేర్కొంది. ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని అంచనా వేసింది. అయితే- ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, మేఘాలయ, అస్సాంలో అంతకంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది.

Tags:    

Similar News