President Rule in Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపు ఎందుకు? వచ్చే మార్పులు ఏంటి?
President Rule in Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన.. వచ్చే మార్పులు ఏంటి?
President's Rule in Manipur: మణిపూర్‌లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ రాజీమా చేసిన మూడు రోజుల తరువాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174(1) ప్రకారం ఏ రాష్ట్ర అసెంబ్లీ అయినా ప్రతీ 6 నెలలకు ఒకసారి సమావేశం కావాల్సి ఉంటుంది. మణిపూర్ లో చివరి అసెంబ్లీ సమావేశం గతేడాది ఆగస్టు 12న జరిగింది. ఫిబ్రవరి 12 బుధవారంతో ఆ డెడ్‌లైన్ ముగిసింది.
మణిపూర్ రాష్ట్రంలో సాధారణ పరిపాలన సజావుగా సాగే పరిస్థితి లేదని ఆ రాష్ట్ర గవర్నర్ పంపిన నివేదికను పరిశీలించిన తరువాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రాష్ట్రపతి తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపుపై కేంద్ర హోంశాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
మణిపూర్‌లో అల్లర్లు - విధ్వంసం
మణిపూర్‌లో 2023 మే నెల నుండి అనిశ్చిత పరిస్థితులు నెలకున్నాయి. మీటి, కుకి-జో తెగల మధ్య సంఘర్షణతో అల్లర్లు జరుగుతున్నాయి. ఈ అల్లర్లు కాస్తా విధ్వంసానికి దారితీసింది. అప్పటి నుండి జరిగిన వేర్వేరు అల్లర్ల ఘటనల్లో 200 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రపతి పాలనతో జరిగే మార్పులు ఏంటి?
రాజ్యంగం పరంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించలేని పక్షంలోనే రాష్ట్రపతి పాలన విధిస్తారు. దీంతో అప్పటి వరకు పరిపాలన విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అన్ని హక్కులు కేంద్రానికి బదిలీ అవుతాయి. శాసనాల పరంగా రాష్ట్ర అసెంబ్లీ తీసుకునే నిర్ణయాలు, విధులు పార్లమెంట్‌కు బదిలీ అవుతాయి.
ఇప్పటికి ఇలా ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించారు?
1950 నుండి నేటి వరకు 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 134 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. గతంలో మణిపూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఇక ఎక్కువ కాలంపాటు ప్రెసిడెంట్ రూల్ కొనసాగిన రాష్ట్రంగా జమ్మూకశ్మీర్ ఉంది. కశ్మీర్ లోయలో మొత్తం 12 ఏళ్లు రాష్ట్రపతి పాలన కొనసాగింది.