Maha Kumbh: అసౌకర్యానికి గురైతే క్షమించండి.. కుంభమేళా ముగింపు సందేశంలో మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రయాగ్ రాజ్‌లో 45 రోజుల పాటు జరిగిన మహా కుంభమేళా ఘనంగా ముగిసింది. మహాకుంభ మేళా ముగింపును పురస్కరించుకుని ప్రధాని మోడీ దేశ ప్రజలకు సందేశమిచ్చారు.

Update: 2025-02-27 10:58 GMT

అసౌకర్యానికి గురైతే క్షమించండి.. కుంభమేళా ముగింపు సందేశంలో మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

Maha Kumbh: ప్రయాగ్ రాజ్‌లో 45 రోజుల పాటు జరిగిన మహా కుంభమేళా ఘనంగా ముగిసింది. మహాకుంభ మేళా ముగింపును పురస్కరించుకుని ప్రధాని మోడీ దేశ ప్రజలకు సందేశమిచ్చారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఐక్యత మహాకుంభ్‌గా అభివర్ణించారు. భక్తులు ఎవరైనా అసౌకర్యానికి గురైనట్లయితే క్షమించాలని కోరారు. 45 రోజుల పాటు సాగిన ఈ మహాకుంభమేళా విశేషాలను ప్రధాని మోడీ తన బ్లాక్‌లో చేశారు.

ఐక్యత కోసం జరిగిన ఈ మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసింది. భారతీయ ఐక్యతకు కుంభమేళా నిదర్శనంగా నిలిచింది. అంచనాలకు మించి పలు ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తుల ప్రయాగ్ రాజ్‌కు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. భారత్ కొత్త శక్తితో ముందుకు సాగుతుందన్నారు మోడీ. నవభారత్‌ను నిర్మించే కొత్త శకం వచ్చిందని చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని దేనితోనూ పోల్చలేమన్నారు.

త్రివేణి సంగమం నదీ తీరానికి అన్ని కోట్ల మంది ఎలా వచ్చారంటూ యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోందన్నారు. ఈ భక్తులెవరికీ అధికారికంగా ఆహ్వానాలు పంపించలేదు. అయినా పవిత్ర సంగమంలో పుణ్య స్నానాల కోసం వారంతా తరలివచ్చారు. నదిలో స్నానమాచరించిన తర్వాత వారి ముఖాల్లో కనిపించిన సంతోషం నేనెప్పటికీ మర్చిపోలేను. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు కుంభమేళాకు రావడం చాలా సంతోషంగా ఉందని మోడీ చెప్పుకొచ్చారు.

ఈ మహా కుంభమేళా భారతదేశ జాతీయ చైతన్యాన్ని బలోపేతం చేసిందన్నారు. 144 ఏళ్ల తర్వాత జరిగిన ఈ మహా కుంభమేళా భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం అందించిన సందేశంగా నిలిచిందన్నారు. దేశంలోని ప్రతి భక్తుడు ఈ మహా యాగంలో భాగస్వామి అయ్యాడు. భారతదేశం అందించిన ఈ మరుపురాని దృశ్యం కోట్లాది మందిలో ఆధ్యాత్మికతను పెంపొందించిందన్నారు. నాడు బాలుడి రూపంలో కృష్ణడు తన తల్లి యశోదకు తన నోటిలో విశ్వాన్ని చూపించాడు. అదే విధంగా ఈ మహాకుంభ్ ప్రపంచానికి భారతీయులు అపార శక్తి రూపాన్ని చూపిందన్నారు మోడీ.

ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులభంకాదు. అయితే నేను గంగా, యమున, సరస్వతి మాతలను ప్రార్థించాను. పూజలలో ఏదైన లోపం ఉంటే క్షమించమని కోరాను. భక్తులకు సేవ చేయడంలో విఫలమైతే క్షమాపణలు కోరుతున్నానన్నారు మోడీ. ఈ ఐక్యతా మహా కుంభమేళాలో కోట్లాది మందికి సేవ చేసే భాగ్యం భక్తి ద్వారానే సమకూరిందన్నారు.

మహాకుంభమేళాను సక్సెస్ చేసిన యూపీ ప్రభుత్వానికి, సహకరించిన ప్రయాగ్ రాజ్ ప్రజలు, భక్తులకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. ప్రయాగ్ రాజ్‌లో ప్రజలు ఈ 45 రోజుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇక్కడికీ వచ్చే భక్తులను ఆదరించారన్నారు. మహా కుంభమేళా దృశ్యాలను చూసినప్పుడు నా మనసులో మెదిలిన భావాలు మరింత బలపడ్డాయి. దేశ ప్రజల ఉజ్వల భవిష్యత్తుపై నా నమ్మకం అనేక రెట్లు పెరిగిందని ప్రధాని మోడీ ఈ బ్లాగ్‌లో రాశారు.


Tags:    

Similar News