చిన్న వ్యాపారుల భవిష్యత్తు ఎప్పుడూ డోలాయమానంగానే ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు.. రెక్కలు ముక్కలు చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసి కుటుంబ పోషణ సాగించే వారికి, వయసు మళ్లిన తరువాత బతుకుపై భరోసా ఉండదు. కష్టం చేయలేని పరిస్థితిలో పోషణ ఇబ్బందిగా మారి అగచాట్లు పడుతుంటారు. ఇప్పుడు అటువంటివారికి కేంద్ర ప్రభుత్వం ఆసరా కల్పించే ఏర్పాటు చేసింది. అదే చిన్న వ్యాపారుల పించను పధకం. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ పథకం విధి విధానాలను కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది.
చిరు వ్యాపారం చేసుకునే 18 నుంచి 40 సంవత్సరాల వయసున్న వారంతా ఈ పథకానికి అర్హులే. రూ.1.5 కోట్లలోపు వార్షిక వ్యాపార టర్నోవర్ ఉన్నవ్యాపారులంతా ఇందులో చేరొచ్చు. ఈ పథకంలో చేరిన వ్యక్తి 60 సంవత్సరాల వయసు వచ్చినప్పటినుంచి నెలకు 3 వేల రూపాయలు అందుకోవచ్చు. వ్యాపారి నెల నేలా చెల్లించే చందాకు సమానంగా అంతే మొత్తాన్ని కేంద్రం పించను నిధికి జమ చేస్తుంది. ఈ పథకం పై ఆసక్తి ఉన్నవారు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 3.5 లక్షల కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఆసక్తి కల చిరు వ్యాపారులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
ఈ పథకంలో చేరాలంటే నిబంధనలు ఇవే...
- ఈ పథకంలో చేరిన వ్యక్తి పూర్తిగా కొనసాగితే, అతనికి 60 ఏళ్ల నుంచి అతను జీవించి ఉన్నంత కాలం నెలకు రూ.3వేల పింఛను అందుకోవచ్చు. మరణానంతరం జీవిత భాగస్వామికి 50% మొత్తం చెల్లిస్తారు.
- కొన్నాళ్లు చెల్లించి మధ్యలో ఆపేసిన వ్యక్తులు ఎవరైనా మళ్లీ దాన్ని కొనసాగించాలనుకుంటే పాతబకాయిలను, వడ్డీతో సహా చెల్లించి తమ సభ్యత్వాన్ని
పునరుద్ధరించుకోవచ్చు.
- ఈ పథకంలో చేరిన వారు పదేళ్లలోపు వైదొలిగితే అప్పటివరకూ చెల్లించిన మొత్తాన్ని సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వడ్డీ రేటుతో తిరిగి ఇచ్చేస్తారు.
- ఒకవేళ పదేళ్ల తర్వాత వైదొలిగితే పింఛను ఫండ్‌లో పొందిన వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు.
- నెలవారీ చెల్లింపులు చేస్తూ మధ్యలో ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే వారి స్థానంలో వారి జీవిత భాగస్వామి సభ్యులుగా చేరి నెలవారీ మొత్తం చెల్లిస్తూ
పోవచ్చు.
* అలాంటి వారికి 60 ఏళ్ల తర్వాతే పింఛను ఇస్తారు.
* జీవిత భాగస్వామి మృతిచెందిన కారణంగా దాని నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంటే అప్పటి వరకూ చెల్లించిన చందామొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి
చెల్లిస్తారు.
- పథకంలో చేరిన తర్వాత అంగవికలురై పథకంలో కొనసాగలేకపోయిన వారికీ ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
- పింఛను అందుకొనేవారు మధ్యలో చనిపోతే అతని జీవిత భాగస్వామికి నెలవారీ సగం మొత్తం మాత్రమే అందుతుంది.
- 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఈ పథకంలో చేరిన ప్రతి ఒక్కరూ తమకు 60 ఏళ్లు వచ్చేంత వరకూ నెలవారీ చందా చెల్లిస్తూ పోయిన వారికి మాత్రమే
60 ఏళ్ల తర్వాత రూ.3వేల కుటుంబ పింఛను అందుతుంది.
- ఈ పథకంలో 'కుటుంబం' అంటే కేవలం భార్యా, భర్తలు మాత్రమే వస్తారు.
- సొంతంగా వ్యాపారాలు చేస్తున్నవారు, దుకాణ యజమానులు, రిటైల్ వ్యాపారులు, రైస్‌మిల్లు, ఆయిల్ మిల్లు, వర్క్‌షాప్ ఓనర్లు, కమీషన్ ఏజెంట్లు, రియల్
ఎస్టేట్ బ్రోకర్లు, చిన్నచిన్న హోటల్, రెస్టారెంట్ల యజమానులు, ఇతర చిన్న వ్యాపారులు ఈ పథకం పరిధిలోకి వస్తారు.
- ఎన్‌పీఎస్, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే వారికి ఇందులో చేరడానికి అర్హత ఉండదు.