Pahalgam Attack: ప్రధానితో రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ... ఈ సూపర్ కమిటి ఎందుకు అంత పవర్‌ఫుల్?

Update: 2025-04-30 10:22 GMT

Pahalgam Attack News: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCPA) భేటీ అయింది. లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగింది. అన్ని కేబినెట్ కమిటీలలో రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే ఈ కేబినెట్ కమిటీ సూపర్ పవర్ ఫుల్ కేబినెట్ కమిటీగా పిలుస్తుంటారు. ఈ కేబినెట్ కమిటీకి అన్ని అధికారాలు ఉంటాయి. ఇదే కాకుండా ఈరోజు మరో రెండు ముఖ్యమైన కేబినెట్ కమిటీల భేటీలు కూడా నిర్వహించారు. అందులో ఒకటి ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీతో సమావేశం కాగా మరొకటి జాతీయ భద్రత సంబంధిత అంశాలను చర్చించే కేబినెట్ కమిటీ భేటీ.

సీసీపీఏలో ఎవరెవరు ఉంటారు?

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి, పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్, షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద సోనోవల్, బొగ్గు శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ ఎఫైర్స్ లో సభ్యులుగా ఉన్నారు.

సీసీపీఏ డ్యూటీ ఏంటి?

క్లిష్ట సమయాల్లో దేశ రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులపై ఈ సీసీపీఏ నిర్ణయాలు తీసుకుంటుంది.

దేశం అంతా ఒక్కతాటిపైకి రావాల్సిన సందర్భాల్లో రాష్ట్రాలు, కేంద్రంతో ఏకీభవించేలా వ్యవహరించడంలో ఈ సీసీపీఏ కీలక పాత్ర పోషిస్తుంది.

వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం ఉండేలా చూడటంలోనూ సీసీపీఏ పనిచేస్తుంది.

దేశ రాజకీయాలు, దేశ స్థితిగతులపై ఎలాంటి దుష్ర్పభావాలు పడకుండా ఫారెన్ పాలసీపై సీసీపీఏ నిర్ణయాలు తీసుకుంటుంది.

మిలిటరీకి ఫుల్ పవర్స్ ఇచ్చిన ప్రధాని మోదీ

నిన్న మంగళవారం కూడా ప్రధాని మోదీ అత్యున్నత సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధినేతలు పాల్గొన్నారు. పహల్గామ్ దాడి ఘటన తరువాత ఇండియా, పాకిస్థాన్ మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఇండియా ఏ క్షణమైనా ప్రతిదాడికి దిగొచ్చని పాకిస్థాన్ భావిస్తోంది. అందుకే ఇండియా ఎలాంటి దాడికి పాల్పడినా దానిని తిప్పికొట్టేందుకు తమ సేనలు సిద్ధంగా ఉన్నాయని పాకిస్థాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ను ఎదుర్కునేందుకు ప్రధాని మోదీ త్రివిధ దళాల అధినేతలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ ఈ అత్యున్నత సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

Tags:    

Similar News