Tamil Nadu: తమిళనాడును వీడని వర్షాలు.. జిల్లాల్లో రెడ్ అలర్ట్

*మరోసారి మునిగిన చెన్నై నగరం *లోతట్టు ప్రాంతాల్లో మోకాల్లోతు చేరిన నీరు *మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Update: 2021-11-28 05:03 GMT

తమిళనాడును వీడని వర్షాలు

Tamil Nadu: తమిళనాడును వర్షాలు వీడటం లేదు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు చెన్నై, శివారు లోతట్టు ప్రాంతాలు మళ్లీ నీట మునిగాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శివార్లలోని ఆలందూరు, పజవంతాంగల్‌, ఎయిర్‌పోర్టు, పల్లవరం, పెరంగళత్తూరు, క్రోంపేట తదితర ప్రాంతాలు నీట మునిగాయి. తాంబరంలో చాలామంది వరద నీటిలో చిక్కుకుపోయారు. శుక్రవారం రాత్రి నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షాలకు చెన్నై, ఉత్తర చెన్నై పరిధిలోని సుమారు 500 వీధుల్లో మోకాలిలోతు నీరు చేరింది.

చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ పర్యటించి సహాయచర్యలను పర్యవేక్షించారు. మరోవైపు వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించడంతో అప్రమత్తమైన అధికారులు రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు శనివారం సెలవు ప్రకటించారు. పూందమల్లి, ఆవడి, అంబత్తూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల పరిధిలో అనేక చెరువులు తెగడంతో వరదలు పోటెత్తాయి. రాష్ట్రంలో శనివారం వర్షాల సంబంధిత ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం తెలిపింది.

కాంచీపురం నుంచి జాతీయ రహదారిని కలిపే మార్గం పాలారు నది వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఈశాన్య రుతుపవనాలతో ఏటా అక్టోబర్‌ - డిసెంబర్‌ నెలల్లో తమిళనాట ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది ఇదే సమయంలో సాధారణ వర్షపాతం కంటే 75 శాతం అధికంగా వానలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా సముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది.

Tags:    

Similar News