2019 ఆర్ధిక సర్వేలో పాజిటివ్‌ సంకేతాలు..చమురు ధరలు..

Update: 2019-07-04 12:02 GMT

కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రవేశపెట్టే ఎకనమిక్ సర్వే దేశ ప్రజలకు పాజిటివ్‌ వెబ్రేషన్స్‌‌ను పంపింది. జీడీపీ వృద్ధిరేటు పెరుగుతుందని, వడ్డీ రేట్లు-చమురు ధరలు తగ్గుతాయని, వినిమయ శక్తి పెరుగుతుందంటూ గుడ్‌న్యూస్‌ చెప్పింది. దేశ ఆర్ధిక ముఖచిత్రాన్ని ప్రతిబింబించే ఎకనమిక్‌ సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్ధిక సవాళ్లు, సంస్కరణల లక్ష్యాలను సభ ముందు ఉంచారు.

2020 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7శాతం ఉంటుందని ఎకనమిక్‌ సర్వే అంచనా వేసింది. అలాగే డిమాండ్‌, రుణ లభ్యత పెరగడంతో పెట్టుబడుల వృద్ధి రేటు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. దేశ ఆర్ధిక ముఖచిత్రాన్ని ప్రతిబింబించే 2019 ఎకనమిక్ సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సవాళ్లను ప్రస్తావించారు.

2018తో పోల్చితే 2019లో ద్రవ్యలోటు 6.4శాతం నుంచి 5.8శాతానికి తగ్గిందని తెలిపింది. అలాగే 2020లో దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు స్వల్పంగా పెరిగి 7శాతంగా ఉంటుందని అంచనా వేసిన ఎకనమిక్ సర్వే 2025 నాటికి ఐదు ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థగా భారత్‌ ఎదగాలంటే మాత్రం 8శాతం జీడీపీ వృద్ధిరేటుతో ముందుకెళ్లాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. అయితే వ్యయాలు పెరగడం, ప్రైవేటు పెట్టుబడుల్లో వృద్ధి కారణంగా 2019-20లో జీడీపీ వృద్ధిరేటు వేగంగా పెరుగుతుందని అంచనా వేశారు.

దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటంతో పెట్టుబడుల వాతావరణాన్ని పెంచుతుందని, దాంతో పెట్టుబడుల రేటు మరింత పెరిగే అవకాశముందని ఎకనమిక్ సర్వే అంచనా వేసింది. అలాగే ఈ ఆర్ధిక సంవత్సరంలో చమురు ధరలు దిగొస్తాయంటూ దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. చమురు ధరలు అందుబాటులో రానుండటంతో వినిమయ శక్తి పెరుగుతుందని తెలిపింది. మొత్తానికి కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రవేశపెట్టే ఎకనమిక్‌ సర్వే దేశ ఆర్ధిక పరిస్థితిపై పాజిటివ్‌ వెబ్రేషన్స్‌‌ను ప్రజలకు పంపింది.

Tags:    

Similar News