Nimisha Priya: బ్లడ్‌మనీకి అంగీకరించం.. నిమిష ప్రియకు శిక్ష పడాల్సిందే

Nimisha Priya: యెమెన్‌లో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ కేసు ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను సృష్టిస్తోంది.

Update: 2025-07-16 09:15 GMT

Nimisha Priya: యెమెన్‌లో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ కేసు ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను సృష్టిస్తోంది. నేడు అమలవ్వాల్సిన మరణశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించగా, ఈ పరిణామంతో కొంత ఊరట ఏర్పడింది. అయితే ఈ కేసులో మృతుడు తలాల్ అదిబ్ మెహది కుటుంబం మాత్రం నిమిషకు శిక్ష తప్పక అమలవ్వాలంటూ దృఢంగా నిలిచింది.

మృతుడు తలాల్‌ సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహది మీడియాతో మాట్లాడుతూ, నేరానికి క్షమాపణ ఉండదని స్పష్టంచేశారు. ‘‘బ్లడ్‌మనీ (క్షమాధన రాకం) తీసుకునే ఉద్దేశం లేదు. ఆమె తప్పు చేసింది. శిక్ష అనుభవించాల్సిందే. మేం ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు మా అభిప్రాయాన్ని మార్చలేవు. డబ్బుతో ప్రాణానికి విలువ నిర్ణయించలేం’’ అంటూ ఫేస్‌బుక్‌లో తీవ్ర స్పందన వ్యక్తం చేశారు.

అలాగే నిమిషను బాధితురాలిగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ, అది సరైంది కాదని హితవు పలికారు.

నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా విషయం గురించి భారత విదేశాంగ శాఖ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. యెమెన్ జైలు అధికారులు, ప్రాసిక్యూటర్ కార్యాలయంతో నిరంతర చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. నిమిష కుటుంబం, బాధిత కుటుంబం పరస్పర అంగీకారానికి రావడానికి మరింత సమయం ఇవ్వాలని భారత్ తరపున విజ్ఞప్తి చేసినట్టు తెలిపింది. ఈ కృషికి ఫలితం దొరికిందని పేర్కొంది.

ఇప్పటికే నిమిష ప్రియ కుటుంబం దాదాపు 1 మిలియన్ డాలర్లు (రూ.8.6 కోట్లు) బ్లడ్‌మనీగా ఇవ్వడానికి సిద్ధమైందని సమాచారం. బాధిత కుటుంబం అంగీకరిస్తే, నిమిష మరణశిక్ష తప్పించుకునే అవకాశముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాధిత కుటుంబం ఈ ప్రతిపాదనను అంగీకరించాలనే అంశంపై మతగురు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ చర్చలు కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం కేసు ఓ మలుపు తీసుకుంటోంది. నిమిష ప్రాణం దక్కుతుందా? బాధిత కుటుంబం క్షమాధనాన్ని అంగీకరిస్తుందా? అన్న ఉత్కంఠ భారతదేశంతో పాటు అంతర్జాతీయంగా కూడా కొనసాగుతోంది. చివరికి ఈ చర్చలు ఏ మేరకు ఫలిస్తాయన్నది కాసేపట్లో తేలనుంది.

Tags:    

Similar News