NHAI world record: 25 కిలోమీటర్ల రోడ్డు..18 గంటల్లో..ప్రపంచ రికార్డ్!

అత్యంత వేగంగా రహదారి నిర్మించి ప్రపంచ రికార్డ్ సృష్టించింది ఇండియా

Update: 2021-03-01 07:19 GMT
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులకెక్కిన రోడ్డు నిర్మాణం (కేంద్ర మంత్రి గడ్కారీ ట్విట్టర్ నుంచి)

ఒక కిలోమీటర్ రోడ్డు వేయాలంటే ఎంతో హైరానా. వనరులు సమకూర్చి..రోడ్డు నిర్మాణానికి అన్నీ సిద్ధం చేసి.. రోడ్డు వేసే పని పూర్తి చేసేదాకా ఎంతో సమయం పడుతుంది. అటువంటిది కేవలం 18 గంటల్లో 25.54 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసింది NHAI (National Highways Authority of India). ఈ విషయాన్ని జాతీయ రహదారుల శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ట్విట్టర్ లో వెల్లడించారు. ఇంతకీ ఈ రోడ్డు ఎక్కడ వేశారో తెలుసా?

నేషనల్ హైవే నెంబర్ 52లో.. మహారాష్ట్రలోని విజయపూర్, సోలాపూర్ మధ్య ఉంది. ఇది నాలుగు లేన్ల రోడ్డ్డు. ఇందులో మొదటి లేన్ రికార్డు సమయంలో నిర్మించారు. కేవలం 18 గంటల్లో పాతిక కిలోమీటర్ల పైగా రోడ్డు నిర్మాణం జరిగింది. ఈ రికార్డు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అయిందని మంత్రి గడ్కారీ తెలిపారు. ''అత్యంత వేగంగా జరిగిన రోడ్డు నిర్మాణం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఈ పనిలో పాల్గొన్న కార్మికులకు, NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ కూ, నిర్మాణ కంపెనీ ప్రతినిధులకు శుభాబినందనలు'' అంటూ గడ్కారీ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ ఫోటోలను కూడా అయన పోస్ట్ చేశారు.

బెంగళూరు-చిత్రదుర్గ-విజయపూర్-సోలాపూర్-ఔరంగాబాద్-ధూలే-ఇండోర్-గ్వాలియర్ ల మధ్య ఈ హైవే ఉంది. ఇది చాలా పెద్ద హైవే. ఈ రోడ్డుపై ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ. అందుకే దీనిని NHAI హై డెన్సిటీ ట్రాఫిక్ కారిడార్ గా పేర్కొంటుంది. ఇటువంటి రద్దీ రహదారిపై ఇంత వేగంగా రోడ్డు నిర్మాణం చేయడం మామూలు విషయం కాదు. అయితే, ఈ రోడ్డు మొత్తం ఒకే చోట కాలేదు.. ముక్కలు ముక్కలుగా పాతిక కిలోమీటర్లు నిర్మాణం జరిగింది. నిజానికి 12 గంటల్లో 20 కిలోమీటర్ల రోడ్డు వేయాలని పని ప్రారంభించారు. కానీ, మరో ఆరుగంటలు పని పొడిగించి పాతిక కిలోమీటర్లు పూర్తి చేశారు.

ఈ హైవే మొత్తం 110 కిలోమీటర్లు వేయాల్సి ఉంది. ఇది సోలాపూర్-విజయపూర్ మధ్య ఉంటుంది. నాలుగు లేన్ల ఈ రోడ్డు పనులు అక్టోబర్ 2021 నాటికి పూర్తవుతాయని గడ్కారీ పేర్కొన్నారు. 



Tags:    

Similar News