Mumbai Rain: దేశ వాణిజ్య రాజధానిని ముంచెత్తుతున్న వానలు

Mumbai: మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు * స్తంభించిన ముంబై నగర జీవితం

Update: 2021-06-12 05:29 GMT

ముంబైలో బారి వర్షాలు (ఫోటో ది హన్స్ ఇండియా)

Mumbai: నైరుతి రుతు పవనాలు వచ్చీ రాగానే దేశ వాణిజ్య రాజధానిని ముంచెత్తాయి. తొలివానే బీభత్సంగా కురవడంతో ముంబై నగరం మునకేసింది. మరో ఐదు రోజుల పాటు ఈ మహానగరానికి వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలతో ముంబై నగరంలో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. గత ఏడాది కురిసిన వర్షాలకు అతలాకుతలం అయిన ముంబై నగరం.. ఈ ఏడాది కూడా స్టార్టింగ్‌లోనే వర్షాలు బీభత్సం సృష్టించింది. దేశ వాణిజ్య రాజధాని నగరంతో సహా అనేక జిల్లాలు భారీ వర్షాలతో అస్తవ్యస్తంగా మారాయి. ముంబై నగరంలో రోడ్లన్నీ కాలువలుగా మారిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. పలు పాత భవనాలు కూలి ఇప్పటికే డజను మంది చనిపోయారు. వారిలో 8 మంది చిన్నారులే ఉన్నారు. ముంబై విమానాశ్రయంలో అరగంట పాటు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంతో ఏమీ కనిపించకపోవడంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ విమానాలు ల్యాండ్‌ కావడానికి అనుమతించలేదు.

ఇప్పటికే అస్తవ్యస్తంగా మారిన ముంబై మహానగరంతో పాటు పాల్ఘార్‌, థానె, రాయగఢ జిల్లాలకు మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్ప పీడన ప్రభావం, పశ్చిమ తీరంలో బలమైన గాలులు వీస్తుండటంతో వర్షాలు దండిగా కురుస్తున్నాయి. ముంబై నగరంలో గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పల్లపు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. మ్యాన్‌హోల్స్‌ ద్వారా నీటిని పంపించేందుకు మున్సిపల్‌ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నగరంలో వరద ప్రవాహాన్ని నియంత్రించడానికి రెండు ప్రాంతాల్లో స్టోరేజ్‌ ట్యాంకులను నిర్మిస్తున్నారు. రానున్న పదిహేను రోజుల్లో వాటి నిర్మాణం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. రోడ్లపై ప్రవహించే నీటిని పెద్ద పెద్ద మోటార్లతో స్టోరేజ్‌ ట్యాంకుల్లో్కి తోడిపోస్తారు. దీంతో రోడ్లపై ఒత్తిడి తగ్గి..ట్రాఫిక్‌ సాధారణంగా ఉంటుందని వివరిస్తున్నారు మున్సిపల్‌ అధికారులు.

బంగాళఖాతంలో కూడా అల్పపీడనం ఏర్పడటంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా ప్రాజెక్టులకు ఈసారి ముందుగానే వరద నీరు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Tags:    

Similar News