Mumbai Bmc Election Results: ముంబై మేయర్ పీఠం ఎవరి చేతిలో? నేడే కౌంటింగ్..!!
Mumbai Bmc Election Results: ముంబై మేయర్ పీఠం ఎవరి చేతిలో? నేడే కౌంటింగ్..!!
BMC: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఫలితాలు నేడు ఉదయం 10 గంటల నుంచి వెలువడనున్నాయి. దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ సంస్థగా పేరొందిన బీఎంసీ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో, కౌంటింగ్ ప్రారంభానికి ముందే ముంబై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 227 వార్డులకు నిర్వహించిన ఈ ఎన్నికల్లో సుమారు 46 నుంచి 50 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈసారి బీఎంసీ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థ పరిపాలనకే కాకుండా, మహారాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును నిర్దేశించే కీలక పరీక్షగా మారాయి. ముఖ్యంగా ముంబై నగరంపై ఆధిపత్యం సాధించడం ద్వారా ఆర్థికంగా, రాజకీయంగా బలమైన పట్టు సాధించవచ్చనే లెక్కలతో పార్టీలన్నీ బరిలో దిగాయి. మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే కనీసం 114 వార్డుల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఆధిక్యం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనాలు వెలువడ్డాయి. అయితే శివసేన (ఉద్ధవ్ వర్గం), కాంగ్రెస్, ఎన్‌సీపీ కూటమి కూడా చివరి వరకూ గట్టి పోటీ ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో బీఎంసీపై పట్టు సాధించిన శివసేనకు ఇది ప్రతిష్ఠాత్మక ఎన్నిక కాగా, బీజేపీకి ముంబైపై పూర్తి ఆధిపత్యం సాధించే అవకాశం ఇదేనని పార్టీ నేతలు చెబుతున్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫలితాలు వెలువడే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉండటంతో, మేయర్ పీఠం చివరికి ఎవరి ఖాతాలో చేరుతుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.