Marriage: వివాహానికి ముందు సిబిల్ స్కోర్ చెక్.. ఆర్థిక క్రమశిక్షణపై తల్లిదండ్రుల దృష్టి
పెళ్లి సంబంధాల్లో ఇప్పుడు సిబిల్ స్కోర్ కీలకంగా మారింది. యువకుల ఆర్థిక క్రమశిక్షణ, లోన్లు, క్రెడిట్ కార్డు డ్యూస్ ఆధారంగా పెళ్లి నిర్ణయాలు తీసుకుంటున్న తల్లిదండ్రులు.
ఇప్పటి పెళ్లి సంబంధాల్లో ఆర్థిక క్రమశిక్షణ కీలకంగా మారుతోంది. కేవలం మంచి ఉద్యోగం, అధిక జీతం ఉంటే సరిపోదని, యువకుడి సిబిల్ స్కోర్ (CIBIL Score) కూడా తప్పనిసరిగా బాగుండాలన్న అభిప్రాయానికి కొందరు తల్లిదండ్రులు వచ్చారు.
రేపల్లెకు చెందిన ఓ యువకుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ నెలకు రూ.లక్షకు పైగా సంపాదిస్తున్నాడు. అయితే పెళ్లిచూపులకు వచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు అతని సిబిల్ స్కోర్ తెలుసుకున్న తర్వాత సంబంధాన్ని తిరస్కరించి వెళ్లిపోయిన సంఘటన తాజాగా చర్చనీయాంశంగా మారింది.
మారుతున్న పెళ్లి ప్రమాణాలు
గతంలో పెళ్లి సంబంధం కుదరాలంటే అబ్బాయికి ఇల్లు, మంచి ఉద్యోగం ఉంటే చాలని భావించేవారు. కుటుంబం బాగుంటే, పిల్లను బాగా చూసుకుంటాడనే నమ్మకంతో వివాహం ఖాయం చేసేవారు.
కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. యువకుడి సంపాదనతోపాటు అతని లోన్లు, క్రెడిట్ కార్డు వినియోగం, ఆర్థిక బాధ్యత వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు.
చెక్‌బౌన్స్ కేసులు, క్రెడిట్ కార్డు ఓవర్ డ్యూస్, లోన్ సెటిల్‌మెంట్లు ఉన్నాయంటే కొన్ని కుటుంబాలు సంబంధానికి నేరుగా ‘నో’ చెప్పేస్తున్నాయి.
సిబిల్ స్కోర్ ఎందుకు ముఖ్యమైంది?
సిబిల్ స్కోర్ ద్వారా ఒక వ్యక్తి ఆర్థిక స్థితిగతులు స్పష్టంగా తెలుస్తాయి.
- ఎన్ని బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నాడు
- ఏ రకం రుణాలు ఉన్నాయి
- వాయిదాలు సమయానికి చెల్లిస్తున్నాడా
- ఎలాంటి ఓవర్ డ్యూస్‌లు ఉన్నాయా
అన్నీ ఈ స్కోర్‌లో కనిపిస్తాయి. సాధారణంగా 750 పాయింట్లకు పైగా సిబిల్ స్కోర్ ఉంటే మంచిదిగా పరిగణిస్తారు. అంతకంటే తక్కువ ఉంటే ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని భావించే అవకాశం ఉంది.
యువకులూ జాగ్రత్త!
ఈ నేపథ్యంలో పెళ్లి కాని యువకులు తమ సిబిల్ స్కోర్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
సకాలంలో లోన్లు చెల్లించడం, క్రెడిట్ కార్డు బకాయిలు పెంచుకోకపోవడం, అనవసర రుణాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.
లేకపోతే, పెళ్లి వ్యవహారం ఆలస్యమయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.