Goa Stampede: ఘోర విషాదం..ఆలయంలో తొక్కిసలాట..ఆరుగురు దుర్మరణం
Goa Stampede: గోవాలో తీవ్ర విషాదం నెలకొంది. శిర్గావ్ లో గల లైరాయ్ ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జాతరను పురస్కరించుకుని పెద్దెత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మరో 50 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణించినవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
శ్రీ లైరాయ్ ఆలయంలో శుక్రవారం నుంచి వార్షిక జాతర షురూ అయ్యింది. దీంతో లైరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్దెత్తున భక్తులు అక్కడికి తరలివచ్చారు. ఆ ఆలయంలో అనాదిగా వస్తున్న నిప్పులపై నడిచే ఆచారంలో శనివారం తెల్లవారుజామున వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రద్దు ఎక్కువైంది. దీంతో పరిస్థితి అదుపు తప్పింది.
భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అత్యవసర విభాగం సిబ్బంది, పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు తెచ్చేందుకు ప్రయత్నించారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జాతర ద్రుష్ట్యా వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.